షోపియాన్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీరులోని షోపియాన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయీబా ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున షోపియాన్‌లోని అల్షిపొరా ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.
 
ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మృతులను మోరిఫత్ మక్బూల్, జాజిమ్ ఫరూఖ్ అలియాస్ అబ్రార్‌గా గుర్తించామన్నారు. ఇరువురు లష్కరే తొయీబా ) ఉగ్ర సంస్థకు చెందినవారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు.
 
కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో వారి హస్తం ఉందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అచన్ ప్రాంతంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాగా, ఆ ప్రాంతంలో గాలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.
కశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు
కాగా, కశ్మీర్‌ లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్‌ లోని గందర్‌బాల్ జిల్లాలో జోజిలా ఎగువ ప్రాంతాలు హిమపాతంతో నిండిపోయాయి. భారీగా మంచు కురుస్తుండటంతో సోనామార్గ్‌-జోజిలా రహదారిని అధికారులు మూసివేశారు. 
 
మరోవైపు జమ్ము కశ్మీర్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌ లోని లాహౌల్‌ – స్పితి ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కనుచూపు మేర శ్వేత వర్ణం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.
 
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్‌ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. శీతాకాలం ప్రారంభం నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ భారీగా మంచు కురుస్తోంది.