
ఇప్పటికే ఇజ్రాయెల్‌లో ప్రవేశించిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తుండగా చాలా ప్రాంతాల్లో ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరుతోపాటు విదేశీయులను కూడా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అంతేగాక, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
బందీలుగా పట్టబుడిన వారిలో థాయ్‌లాండ్, నేపాల్‌కు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతేగాక, భారతదేశానికి చెందిన పౌరులు కూడా హమాస్ ఉగ్రవాదులకు చిక్కినట్లు సమాచారం.
మరోవైపు, భారత్ నుంచి జెరూసలెం పర్యటనకు వెళ్లిన రాజ్యసభ ఎంపీ వాన్‌వేయ్ రాయ్ ఖార్లుఖీ సహా 24 మంది బెత్లహాంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేఘాలయ నుంచి నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఖార్లుఖీ కుటుంబసభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లారు.
ఊహించని విధంగా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో అక్కడే చిక్కుకున్నారు. వీరితోపాటు మరో 24 మంది భారతీయులు అక్కడే క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. వీళ్ల పరిస్థితి గురించి మేఘాలయ సీఎం, ఎన్పీపీ అధ్యక్షుడు కార్నాడ్ సంగ్మా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 27 మంది భారతీయులను విదేశాంగ మంత్రిత్వ శాఖ రక్షించినట్లు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తెలిపారు. భారతీయులను ఈజిప్ట్‌కు తరలించారని, అక్కడి నుంచి స్వదేశం తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
విదేశాంగ శాఖ, ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్లందర్నీ క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవంక, థాయ్‌లాండ్‌కు చెందిన 11 మందిని హమాస్ బంధించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. వారిని గాజాకు తరలించినట్లు పేర్కొంది.
వాళ్లంతా అమాయక ప్రజలని, అక్కడి పరిణామాలతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని థాయ్ ప్రధాని శ్రత్థా థవిసిన్ పేర్కొన్నారు. వారందరినీ క్షేమంగా విడిచిపెట్టాలని కోరారు. కాగా, శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు థాయ్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో పలువురు తమ పౌరులు కూడా తప్పిపోయారని బ్రిటన్ పేర్కొంది. ఇది ఇలావుండగా, 17 మంది నేపాల్ విద్యార్థులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌లో నేపాల్ రాయబారి కాంతా రిజల్ తెలిపారు. వీరిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని చెప్పారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!