5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ తేదీలు ఇవే..!

5 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ తేదీలు ఇవే..!

తెలంగాణ‌తో పాటు 5రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల నగారా మోగింది. తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ 5 రాష్ట్రాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ‌లో 119, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజ‌స్థాన్‌లో 200, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఈసీ పేర్కొన్నారు.

మొత్తంగా 5 రాష్ట్రాల్లో 679 శాస‌న‌స‌భ స్థానాలున్నాయ‌ని తెలిపారు. మిజోరాం శాస‌న‌స‌భ ప‌ద‌వీకాలం డిసెంబ‌ర్ 17, ఛ‌త్తీస్‌గ‌ఢ్ జ‌న‌వ‌రి 3, మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌న‌వ‌రి 8, రాజ‌స్థాన్ జ‌న‌వ‌రి 14, తెలంగాణ శాస‌న‌స‌భ ప‌ద‌వీకాలం జ‌న‌వ‌రి 18 ముగియనున్న‌ట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓట‌ర్లు, 7.8 కోట్ల మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో 60.2 ల‌క్ష‌ల మంది తొలిసారిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

తెలంగాణలో నవంబరు 30న, రాజస్థాన్‌లో నవంబరు 23న, మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న, మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7న తొలి విడత, నవంబరు 17న రెండో విడతలో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.