ఇజ్రాయెల్‌లో హమాస్‌ మిలిటెంట్ల మారణహోమం… 500 మంది మృతి

 
హమాస్‌ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా చేసిన రాకెట్‌ దాడులు మారణ హోమాన్ని సృష్టించాయి. ఇజ్రాయెల్‌ యుద్ధం పేరిట ప్రతి దాడులకు పాల్పడటంతో రెండు వైపులా 500 మందికి పైగా దుర్మరణం చెందారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు.  శనివారం ఉదయం హఠాత్తుగా గాజా సరిహద్దుల నుంచి 5 వేల రాకెట్లు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలతోహమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడి చేశారు. 
 
భూమి, వాయు, జల మార్గాల ద్వారా విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా దుర్మరణం చెందినట్టు, 561 మంది గాయపడినట్టు వార్తలు వెలువడ్డాయి. అనేకమందిని బందీలుగా తీసుకెళ్లారు.  వెంటనే పరిస్థితిని సమీక్షించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు హమాస్‌పై యుద్ధం ప్రకటించారు. ఈ ప్రాంతంలో గత అర్ధ శతాబ్ది కాలంలో ఇది అత్యంత దారుణమైన హింసాకాండగా పరిశీలకులు భావిస్తున్నారు.
 
‘ఆపరేషన్‌ ఐరన్‌ స్వోర్డ్స్‌’ పేరిట గాజాలోని మిలిటెంట్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 230 మంది పౌరులు మరణించారని, 1610 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రజలందరూ భద్రత నియమాలు పాటించాలని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ కోరారు.
 
మిలిటెంట్ల దాడి ప్రభావం పవిత్ర జెరూసలెం నగరం, టెల్‌ అవీవ్‌తో పాటు ఇజ్రాయెల్‌ దక్షిణ, మధ్య ప్రాంతాలపైనా కనిపించింది. వందలాది మంది ప్రజలు భయంతో దుప్పట్లు, ఆహార పదార్థాలు చేత పట్టుకొని పరుగులు తీయడం కనిపించింది. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు వీధుల్లోని పౌరులపై కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి.
 
 షార్‌ హనెగెవ్‌ ప్రాంతీయ కౌన్సిల్‌లోని ఒక పట్టణాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన స్థానిక మేయర్‌ ఓఫిర్‌ లిబ్‌స్టెన్‌ ఉగ్రవాదుల దాడుల్లో మరణించారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండించారు. ఇరు వర్గాలు శత్రుత్వానికి ముగింపు పలికి పౌరులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతివ్వాలని కోరారు. 
గాజా ప్రాంతాన్ని హమాస్‌ 2007లో హస్తగతం చేసుకొన్న తర్వాత చాలా యుద్ధాల్లో ఇజ్రాయెల్‌, పాలస్తీనా మిలిటెంట్లు తలపడ్డారు. అయితే గాజన్‌ వర్కర్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ సరిహద్దులు మూసేయడం తాజా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాలీయన్లు, ఇద్దరు విదేశీయులు చనిపోయారు. 
 
హమాస్‌ అయుధాలు పొందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌ గట్టి నియ్రంతణ విధించాయి. దీంతో చాలా మంది ప్రజలు కనీస అవసరాలైన ఆహారం, నీరు పొందడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. గాజా సరిహద్దుల్ని ఇజ్రాయెల్‌ మూసేయడం వల్ల, తమ ఇండ్లను ధ్వంసం చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ విఫలమైందా?

ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శతాబ్దాల నుంచి యుద్ధం కొనసాగుతున్నది. ఎపుడు ఉద్రిక్తతలు వస్తాయో.. ఏ సమయంలో రాకెట్లు వచ్చి పడతాయో తెలియకపోవడంతో ఇజ్రాయెల్‌ అమెరికా సాయంతో ఐరన్‌డోమ్‌ ఎయిర్‌ ఢిపెన్స్‌ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నది. శత్రువుల రాకెట్లను, శతుఘ్నులను ఈ వ్యవస్థ గాల్లోనే తునాతునకలు చేస్తుంది. 

2021 ఉద్రిక్తతల సమయంలో ఈ వ్యవస్థ వల్లే ఇజ్రాయెల్‌ స్వల్ప నష్టంతో బయటపడింది. కానీ ఈసారి ఈ వ్యవస్థ రాకెట్లను అడ్డుకోలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తున్నది. అందుకే హమాస్‌ ఉగ్రవాదులు 5000 రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించారని విశ్లేషకులు చెప్తున్నారు.