సాహిత్యంలో నార్వే రచయితకు నోబెల్ బహుమతి

సాహిత్యంలో నార్వే రచయితకు నోబెల్ బహుమతి
సాహిత్య రంగంలో విశేష సేవలు అందించినందుకు నార్వే రచయిత జాన్ ఫాసీకి 2023 సంవత్సరానికి గానూ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. జాన్ ఫాసీ సృజనాత్మకతతో కూడిన నాటకాలను, కథలను సృష్టించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. ముఖ్యంగా తన రచనలతో ఆయన నోరు లేని వారి పక్షాన నిలిచి, వారికి ఒక గళంగా నిలిచారని తెలిపింది. 
 
కథలు, నాటకాలు, నవలలు, కవిత్వం, వ్యాస రచన, అనువాదాలు, చిన్నిపిల్లల సాహిత్యం.. ఇలా దాదాపు అన్ని మార్గాల్లో ఆయన తన సాహిత్యాన్ని సృజించారని ప్రశంసించింది. ఆయన రాసిన నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రదర్శించబడిన నాటకాలుగా ఆయన నాటకాలు చరిత్ర సృష్టించాయని వివరించింది. 
 
తన కథలు, నవలలు కూడా ప్రసిద్ధి గాంచాయని ఒక ప్రకటనలో వివరించింది. 1983 లో విప్లవాత్మక కథాాంశంతో ఆయన రాసిన తొలి నవల ‘‘రాట్, స్వార్ట్’’తోనే ఆయన ఎంతో గుర్తింపు సంపాదించారని తెలిపింది. జాన్ ఫాసీ వయస్సు ప్రస్తుతం 64 ఏళ్లు. ఇప్పటివరకు ఆయన 40 కి పైగా నాటకాలు రాశారు. పెద్ద ఎత్తున కథలు, నవలలు, కవిత్వం, వ్యాస రచన, అనువాద రచనలు చేశారు. 
 
నోబెల్ సాహిత్య కమిటీకి ఈ సంవత్సరం ఆండర్స్ ఓల్సన్ నేతృత్వం వహించారు. నార్వే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను జాన్ ఫాసీ రచనలు ప్రతిబింబిస్తాయని ఆయన ప్రశంసించారు. నోబెల్ పురస్కారం ద్వారా 11 మిలియన్ల స్వీడిష్ క్రొనర్లు (దాదాపు 10 లక్షల డాలర్లు), మెడల్, ప్రశంసాపత్రం లభిస్తాయి. 2022 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అన్నీ ఎర్నాక్స్ కు లభించింది.
 
నార్వేలో పుట్టిన జాన్ ఫోసే తన కథనాలతో ఎంతో ప్రఖ్యాతి గాంచారు. మన చుట్టూ జరిగే సంఘటనలే ఆయన కథనాలకు ఆధారం చేసుకోవడమే జాన్ ఫోసే ప్రత్యేకత. నార్వే వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో 1959లో జాన్ ఫోసే పుట్టారు. నార్వేయన్ నినార్క్ శైలిలో జాన్ ఫోసే రచనలు ఉంటాయి. గద్యరచనలో గొప్ప పుస్తకం సెప్టోలజీని 2021లో పూర్తి చేశారు. డెట్‌ ఆండ్రీ నామ్నెట్‌, ది అదర్‌ నేమ్‌, ఉదా ఎర్‌ ఇన్‌ అన్నన్‌ వంటి వినూత్న రచనలు చేశారు.