
నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ సంగ్రామం నేడే ప్రారంభం కానుంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. టోర్నీ ప్రారంభానికి ముందు జరిపే వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది.
దీంతో గత వన్డే ప్రపంచకప్ ఫైనలిస్ట్ జట్లయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇక బుధవారం రాత్రి సంప్రదాయబద్ధంగా కెప్టెన్స్ డే ఈవెంట్‌ను నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ క్లబ్ హౌస్‌కు చెందిన బాంక్వెట్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో 10జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. అహ్మాదాబాద్ వేదికగా ఆ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ జట్టు దుర్భేధ్యఫామ్‌లో ఉండగా, న్యూజిలాండ్ జట్టు గాయాలతో సతమతమౌతోంది.
ఇప్పటికే మూడుసార్లు (1987, 1996, 2011) సహచర దేశాలతో కలిసి వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమిచ్చిన భారత్ ఈ సారి ఒంటరిగా మెగాటోర్నీ నిర్వహిస్తున్నది. 1987లో భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా వరల్డ్‌కప్ నిర్వహించగా.. 1996లో ఈ జాబితాలో శ్రీలంక కూడా చేరింది. ఇక 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చాయి.
ఆతిథ్య భారత్‌తో పాటు, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో గతంలో ఐదు జట్లు (ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్ రెండుసార్లు, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి) ట్రోఫీని ముద్దాడగా.. మిగిలిన ఐదు జట్లు ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్ హోదా దక్కించుకోలేకపోయాయి.
మెగాటోర్నీలో ఆదివారం చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచిన టీమ్ నుంచి ప్రస్తుత భారత జట్టులో కోహ్లీ, అశ్విన్ మాత్రమే ఉండగా.. గత వరల్డ్‌కప్‌లో ఐదు శతకాలతో అదరగొట్టిన రోహిత్ శర్మ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ తరం దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు స్టార్ క్రికెటర్లకు దాదాపు ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్ కానుంది. టీమ్‌ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ; ఆసీస్ నుంచి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్; ఇంగ్లండ్ నుంచి జో రూట్, జోస్ బట్లర్; న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ; దక్షిణాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్; బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ మరో నాలుగేండ్ల తర్వాత జరిగే మెగాటోర్నీలో బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమే. ఇదే చివరి మెగాటోర్నీ కావడంతో ఎలాగైనా సత్తాచాటి విశ్వ విజేతలుగా నిలువాలని వీళ్లంతా కృతనిశ్చయంతో ఉన్నారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్