ఆసియా క్రీడల్లో పారుల్‌ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు

ఆసియా క్రీడల్లో పారుల్‌ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన 5వేల మీ. పరుగులో పారుల్‌ చౌదరి, జావెలిన్‌ త్రోలో అన్నురాణి స్వర్ణ పతకాలను సాధించారు. ముఖ్యంగా 5వేల మీ. పరుగులో పారుల్‌ చౌదరి నయా చరిత్ర లిఖించింది.  ఈ పరుగును 15నిమిషాల 14.75 సెకన్లలో పూర్తి చేసిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డుపుటల్లోకెక్కింది.
పారుల్‌ చౌదరికి ఆసియా క్రీడల్లో ఇది రెండో పతకం. సోమవారం జరిగిన 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో పారుల్‌ చౌదరి రజత పతకం నెగ్గింది. ఇక మహిళల జావెలిన్‌ త్రో ఫైనల్లో అన్నురాణి బంగారు పతకాన్ని ముద్దాడింది. అన్ను రాణి 4వ ప్రయత్నంలో జావెలిన్‌ను 62.93మీ. విసిరి ప్రథమ స్థానంలో నిలిచింది.  ఏషియన్ గేమ్స్ జావెలిన్ త్రో మహిళల విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‍గా అన్నూ రాణి చరిత్ర సృష్టించింది.
 
ఈ క్రీడల్లో పదో రోజు మంగళవారం భారత్‍కు 9 పతకాలు వచ్చాయి. ఇందులో రెండు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈ ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తంగా 69 పతకాలతో (15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు) నాలుగో స్థానంలో ఉంది. చైనా 297 మెడల్స్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. పురుషుల 92కిలోలకు పైబడిన విభాగంలో నరేంద్ర కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నరేంద్ర ఐదురౌండ్ల ఉత్కంఠ పోటీలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, కజకిస్తాన్‌కు చెందిన కంషేబేక్‌ చేతిలో 0-5పాయింట్లతో ఓటమిపాలయ్యాడు.

డెకథ్లాన్‌లో తేజశ్విని శంకర్‌ జాతీయ రికార్డును నెలకొల్పి రజత పతకం సాధించాడు. పురుషుల డెకథ్లాన్‌ ఫైనల్లో తేజశ్విని1500మీ. పరుగులో నాల్గో స్థానంతో మొత్తం 7,666పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో భారత్‌కు పతకం దక్కడం 1974తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో విజరు సింగ్‌ చౌహాన్‌ 7,659పాయింట్లతో జాతీయ రికార్డును నెలకొల్పాడు.

800మీ. పరుగులు మహ్మద్‌ అఫ్సల్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ పరుగులును ఒక నిమిషం 48.43సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. సౌదీ అరేబియాకు చెందిన ఎస్సా అలీకి స్వర్ణ పతకం దక్కింది. భారత్‌కే చెందిన కిషన్‌ కుమార్‌ ఐదోస్థానంలో నిలిచాడు. ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ కాంస్య పతకం సాధించాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో భాగంగా తొలి ప్రయత్నంలో 16.68మీటర్లు జంప్‌ చేసి మూడోస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన అబుబకర్‌ 16.62మీ. నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

బాక్సింగ్‌లో మహిళల 75 కేజీల విభాగంలో ఫైనల్లోకి చేరి లౌల్లీనా బోర్గోహైన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌కు చేరడంతోపాటు పతకం ఖాయం చేసుకుంది. అలాగే వ్యక్తిగత ఆర్చరీ విభాగంలోనూ జ్యోతి సురేఖ వెన్నం కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత ఆర్చరీ అభిషేక్‌ వర్మ, ఓజాస్‌తో కూడిన పురుషుల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఫైనల్స్‌ అక్టోబర్‌ 7న జరగనుంది.