టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు

టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు పోలీసులు సోమవారం  అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ చేపడుతున్న నిరసనల్లో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సీఎం వైఎస్ జగన్ తో పాటు మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదం కావడంతో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది.  తీవ్రంగా స్పందించిన వాసిరెడ్డి పద్మ బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు.
మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను గుంటూరు తరలించారు. మంత్రి రోజాపై చేసిన అనిచిత వ్యాఖ్యలపై ఒక కేసు, సిఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై రెండు కేసులు సత్యనారాయణపై నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. తొలుత మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు.
తన ఇంటి తలుపులను సత్యనారాయణమూర్తి తెరవకపోవడంతో పోలీసులు హడావుడి చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టిడిపి నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి వచ్చిన ప్రయివేటు అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బండారు ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు నోటీసులు అందజేశారు. 41 ఎ, 41 బి సెక్షన్ల కింద ఈ నోటీసులు అందజేసినట్లు వెల్లడించారు. అనంతరం అరెస్టు చేసి ఆయనను విజయవాడకు తరలించారు.  అయితే బండారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 
గుంటూరు పోలీసులు నోటీసులతో బండారు సత్యనారాయణ ఇంటికి చేరుకోవడంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు, మహిళలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు  ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉండడంతో పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు
 
బండారు సత్యనారాయణను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో పరవాడలో రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి వెన్నెలపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. అటు టీడీపీ శ్రేణులు కూడా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు బండారు సత్యనారాయణమూర్తి భార్య మాధవీలత డీఎస్పీ కె.వి సత్యనారాయణ, పరవాడ సీఐ ఈశ్వర్ రావులను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు తన భర్త, తన కుటుంబాన్ని నిర్బంధించి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.