మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్టాత్మక ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 106వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.  ఈ నెల 28న బిల్లుపై సంతకం చేసినట్లు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
దీంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యాంగ (106 సవరణ) చట్టంగా రూపం దాల్చింది. అంతకుముందు గురువారం రోజే భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు.  అనంతరం రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, శుక్రవారం రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.
 
చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా పెద్దలసభ సైతం బిల్లుకు ఆమోద ముద్ర తెలిపింది. 
 
ఉభయసభల ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అయితే, చట్టం తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు మాత్రం లేనట్టే. జనగణన, డీలిమిటెషన్ తర్వాత చట్టాన్ని అమల్లోకి తెస్తామని బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభకు తెలిపారు. 
 
కాగా, 2024 ఎన్నికలు పూర్తికాగానే జనగణన ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకూ అమల్లో ఉండనుంది. దీంతో ఆ తర్వాతే డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనబోయే లేదా ఆ తర్వాత నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.