తెలంగాణట్ర వ్యాప్తంగా బీజేపీ 40 బహిరంగ సభలు

తెలంగాణట్ర వ్యాప్తంగా బీజేపీ 40 బహిరంగ సభలు
* మోదీ,  అమిత్ షా, నడ్డాల రాక

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పధాధికారులు, సీనియర్ నాయకులతో సమావేశం జరిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, రాష్ట్రంలో అభివృద్ధి పనుల దృష్ట్యా ప్రధాని మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటించనున్నారని వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్‌లో, 3వ తేదీన నిజామాబాద్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. 

ప్రధాని పాల్గొనే బహిరంగ సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.  అక్టోబరు 6వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఆ రోజున జరిగే విస్తృత స్థాయి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతారని వెల్లడించారు.  రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించేలా 30 నుంచి 40 సభలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని తెలిపారు.

పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో బిజెపి అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం చేయనుంది అనే అంశాలపై ప్రజలకు తెలియజేసేందుకే బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్‌రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్, విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.