ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జిల్లాకో రెండు మహిళా పోలీస్ స్టేషన్లు

ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారికత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం  తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా నేరుగా  ముఖ్యమంత్రి పర్యవేక్షించే విధంగా ప్రతి జిల్లాకు రెండు మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
 
మహిళలపై పెరుగుతున్న నేరాల నియంత్రణకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త వ్యూహంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారి నేతృత్వంలో రెండు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఈ మహిళా పోలీస్ స్టేషన్లు ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తాయి. 
అలాగే ఏ పోలీసు అధికారి అయినా అవినీతి లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేలితే వారి పదవి నుండి తక్షణమే తొలగిస్తామి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.
మహిళా పోలీసు స్టేషన్ల ఏర్పాటుతో పాటు మహిళల రక్షణకు పెట్రోలింగ్ కూడా తీవ్రతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  నేరస్థుల గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని రకాల నేర కార్యకలాపాలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలను అమలు చేయాలని యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. రాబోయే శారదీయ నవరాత్రి ఉత్సవాల ప్రణాళికలను ఆదిత్యనాథ్ వెల్లడించారు. మిషన్ శక్తి కార్యక్రమం కొత్త దశను ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 
 
శక్తి దీదీ వాలంటీర్ల సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో మహిళలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా దీన్ని చేపడుతున్నారు. అక్టోబరు 14లోగా గౌతమ్‌బుద్ధ్‌నగర్‌తో సహా 17 మున్సిపల్‌ కార్పొరేషన్లకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ ఆదేశించారు. 
వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో యూపీ నుంచి అన్ని సీట్లను బీజేపీ గెల్చుకునేలా వ్యూహరచన చేస్తున్న సీఎం యోగీ ఇందులో భాగంగా కీలకమైన మహిళల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.