20ఏళ్ల తర్వాత కృషి బ్యాంకు డైరెక్టర్‌ను అరెస్ట్

20ఏళ్ల తర్వాత కృషి బ్యాంకు డైరెక్టర్‌ను అరెస్ట్
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కృషి బ్యాంకు స్కామ్‌లో పోలీసుల్ని తప్పించుకుని తిరుగుతున్న నిందితుడ్ని సిఐడి బృందాలు గాలించి పట్టుకున్నాయి. వేలాది మంది ఖాతాదారులను ముంచిన కృషి బ్యాంకు కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలై విచారణ నుంచి తప్పించుకొని తిరుగుతున్న బ్యాంకు డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

22ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో వరుసగా వెలుగు చూసిన బ్యాంకు మోసాల్లో కృషి బ్యాంకు ఒకటి. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేసి నిండా ముంచేశారు. ఈ కేసులో కృషి కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఏ-3గా ఉన్న శ్రీధర్‌ కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. 

పరారీలో ఉన్న శ్రీధర్‌పై నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సీఐడీ ప్రత్యేక బృందాలు గాలించి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీధర్‌ను అరెస్టు చేశారు. నిందితుడ్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు సీఐడీ చీఫ్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

కృషి కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, ఎండీ కొసరాజు వెంకటేశ్వర రావు, మిగత డైరెక్టర్లు, ఉద్యోగులు రూ.36.37 కోట్ల మేరకు డబ్బులు కొల్లగొట్టి బ్యాంకు మూసివేసినట్టు డా. ఎంవీ కుమార్‌, ఇతర ఖాతాదారులు మహంకాళి పోలీస్‌ స్టషన్‌లో 2001 ఆగస్టు 11న ఫిర్యాదు చేశారు. 

మొదట మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసినా ఆ తర్వాత కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదిలీ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితులు జైల్లోనే ఉన్నారు.  బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి విదేశాల్లో ఉన్న బ్యాంకు ఛైర్మన్‌, ఎండీ కొసరాజు వెంకటేశ్వరరావును అరెస్టు చేసి ఆస్తులు స్వాధీనపరచుకున్నారు. 

డైరెక్టర్లలో ఒకరైన కాగితాల శ్రీధర్‌ మాత్రం అప్పటి నుంచీ న్యాయవిచారణకు హాజరవకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఐడీ ఎస్పీ రామిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఇటీవల ఆచూకీ కనుక్కొంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీరాంపేటలో ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్టు చేశారు.