
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశరాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ‘ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్’ అనే అంశంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో శనివారం ప్రధాని మాట్లాడుతూ న్యాయవ్యవస్థ, బార్‌లు భారతదేశ న్యాయవ్యవస్థకు సంరక్షకులుగా ఉన్నాయని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం న్యాయవాద వృత్తిలో భాష సరళతపై దృష్టి పెట్టాలని చెబుతూ ప్రధానంగా దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలని స్పష్టం చేశారు. అలాగే అభివృద్ధి చెందిన దేశపు లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశంలోని న్యాయవ్యవస్థకు బలమైన, స్వతంత్ర, నిష్పాక్షికమైన పునాదులు అవసరం అని ప్రధాని చెప్పారు.
సరళమైన భాషలో కొత్త చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మోదీ తెలిపారు. దీనికి డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు. ఏదైనా చట్టం రెండు భాషల్లో ఉండాలని అంటూ ఒకటి న్యాయవ్యవస్థ తగ్గట్టుగా, ఇంకొకటి సామాన్య పౌరులకు అర్థమయ్యేవిధంగా ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ, తమిళం, గుజరాతీ, ఒడియా అనే నాలుగు భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అనువదించేందుకు కృషి చేసినందుకు మోదీ అభినందించారు.
కాగా, ఈ సదస్సులో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రారు మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సదస్సులో చంద్రచూడ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలోని వ్యక్తులు వివిధ అధికార పరిధి, దృక్కోణాల నుండి ఒకరి నుండి మరొకరు నేర్చుకోవచ్చని తెలిపారు.
`జస్టిస్ డెలివరీలో ఎలాంటి సవాళ్లు ఉండవు. కానీ మనం జస్టిస్ డెలివరీలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారాలను కనుక్కోవాలి. అలాంటి పరిష్కారాలను కనుగొనే రోజు వస్తుందని భావిస్తున్నాను’ అని జస్టిస్ చంద్రచూడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా దేశాలు, సంస్థలు ముఖ్యంగా వ్యక్తులు, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉన్న ప్రపంచంలో సాధ్యం కానిది లేదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు