కావేరి వివాదంలో జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ

కావేరి వివాదంలో జోక్యంకు `సుప్రీం’ నిరాకరణ

కావేరీ నదీ  జలాల వివాదంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీని కావేరీ వాటర్‌ రెగ్యులేషన్‌ కమిటీ (సిడబ్ల్యుఆర్‌సి), కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ (సిడబ్ల్యుఎంఎ) ఇకపై కూడా చేపట్టాలని జస్టిస్‌ బి.ఆర్‌.గవై నేతృత్వంలోని జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ పి.కె.మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. 

సిడబ్ల్యుఆర్‌సి, సిడబ్ల్యుఎంఎలు రెండూ ప్రతి 15 రోజులకు క్రమం తప్పకుండా నీటి అవరసరాలను తీరుస్తూ, పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. కర్ణాటక తమిళనాడుకు ప్రతిరోజూ 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న వాదన అసంబద్ధం, అనవసరమైనది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  ఈ రెండు కమిటీలు అన్ని అంశాలను ముఖ్యంగా కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాయని ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.

కర్ణాటక నుండి రాష్ట్రానికి 7,200 క్యూసెక్కుల నీరు అవసరమని సిడబ్ల్యుఆర్‌సి మొదట నిర్ణయించిందని, కానీ అకస్మాత్తుగా, నీటి మొత్తాన్ని రోజుకు 5,000 క్యూసెక్కులకు తగ్గించిందని తమిళనాడు తరపున న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, జి. ఉమాపతిలు వాదనలు వినిపించారు.  బిలిగుందులు ప్రాజెక్టు వద్ద 5,000 క్యూసెక్కుల నీటి విడుదలకు సిడబ్ల్యుఆర్‌సి ఆదేశాలను సిడబ్ల్యుఎంఎ ధృవీకరించిందని అన్నారు.

సిడబ్ల్యుఆర్‌సి నిర్ణయాన్ని సిడబ్ల్యుఎంఎ యాంత్రికంగా ఆమోదించిందని, కానీ రాష్ట్రంలో పంటల సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాల్సి వుందని రోహిత్గీ పేర్కొన్నారు. అయితే ప్రతిరోజూ 5,000 క్యూసెక్కుల నీటి విడుదల రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని కర్ణాటక తరుపు న్యాయవాది శ్యామ్‌ దివాస్‌ పేర్కొన్నారు.

కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు వంటి పట్టణ ప్రాంతాలు తాగునీటి కొరతను ఎదుర్కోనున్నాయని, కానీ తమిళనాడుకు కేవలం పంటల సాగుకు మాత్రమే నీరు అవసరమని వాదించారు.  గత 15 రోజుల్లో కర్ణాటకలో నీటి కష్టాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో మరో 3,000క్యూసెక్కుల నీటిని అధికంగా ఇవ్వాలని అధికారులు ఆదేశించకూడదని తెలిపారు.

తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవల కర్నాటకను ఆదేశించింది. ఈ నెల 28లోగా తమిళనాడుకు నీరివ్వాలని అథారిటీ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర్వులపై కర్ణాటక సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

కావేరి నదిని ‘పొన్ని’ అని కూడా పిలుస్తుంటారు. ఈ నైరుతి ఇది కర్నాటక పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ఉద్భవించింది. ఈ నది కర్నాటక, తమిళనాడు, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి కావేరి జలాల వివాదం కొనసాగుతున్నది. ఈ సమస్యల పరిష్కారానికి 1990లో కావేరి జల వివాద ట్రిబ్యునల్‌ సైతం ఏర్పాటైంది.