ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ, బిజెపి నేత ధర్మపురి అరవింద్ ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిందని స్పష్టం చేశారు. ఇంకా పనులు, సౌకర్యాలు పూర్తి చేయకముందే ప్రారంభించారని మండిపడ్డారు.
మెడికల్ కళాశాలకు 332.3కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని, వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నిర్మించిందని వెల్లడించారు. తామే కట్టినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకలు గుద్దుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైద్యుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలకు కేసీఆర్ నయాపైస చేసింది లేదని అరవింద్ స్పష్టం చేశారు.
ఎన్నికలు వస్తున్నాయనే అదరా బాదరాగా కేసీఆర్ ప్రారంభించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న పాలసీ వల్ల వైద్యుల సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రాన్ని బిక్షమెత్తుకునేలా సీఎం కేసీఆర్ తయారు చేశారని దుయ్యబట్టారు.
ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బందిపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు.
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని, రోగులను ఎలుకలు కొరుకుతున్నాయని విమర్శించారు. పిల్లలను ఎత్తుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారని, కేంద్రం అనుమతి ఇవ్వకపోతే 9 మెడికల్ కళాశాలలు ఎలా ప్రారంభించారని నిలదీశారు.

More Stories
సింగరేణి టెండర్ల రద్దు కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం
పెండింగ్ చలాన్ల కోసం కీస్ తీసుకోవద్దు, బైక్ లాక్కోవద్దు
వీబీ–జీ రామ్ జీ చట్టం–2025 చారిత్రాత్మక సంస్కరణ