
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా చిత్రంలో సీన్లు ఉన్నాయని, డ్రగ్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారని తెలిపారు.
మాదాపూర్‌లోని ఫ్రెష్లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించిన సమయంలో సన్నివేశాలు ‘బేబి’ సినిమాలో ఉన్నాయని ఆయన చెప్పారు. సినిమా బృందానికి నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఆయన అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. అయితే, మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని తెలిపారు.
‘‘సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరిక కూడా చేయకుండా డైరెక్ట్‌గా ప్లే చేశారు. మేము హెచ్చరించిన తర్వాత యూనిట్ ‘హెచ్చరిక’ లైన్ వేశారు. ఇపుడు ‘బేబీ’ సినిమా ప్రొడ్యూసర్‌కి నోటీసులు ఇస్తాము” అని చెప్పారు. “‘బేబీ’ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారుల ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారు.
ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక నుంచి అన్ని సినిమాలపై మా ఫోకస్ ఉంటుంది. డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఊరుకునేదే లేదు’’ అని హెచ్చరించారు. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. ఓ సంస్థ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి సైతం ఉన్నారని తెలిపారు.
సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని, డ్రగ్స్‌కు వినియోగదారుడిగా ఉన్న సినీ హీరో నవదీప్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామన్న ఆయన నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో నిర్మాత కూడా పరారీలో ఉన్నట్లు వివరించారు.
అయితే సీపీ ఆనంద్ ప్రెస్మీట్లో నవదీప్ అని చెప్పగానే మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌నకు సంబంధం ఉందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో హీరో నవదీప్ స్పందిస్తూ మాదాపూర్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టత ఇచ్చారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్