`ఇండియా’ కూటమికి సనాతన ధర్మాన్ని నిర్మూలించే ఎజెండా

`ఇండియా’ కూటమికి సనాతన ధర్మాన్ని నిర్మూలించే ఎజెండా
విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలిక్ స్ఫూర్తిగా నిలిచిన సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేయాలని వీరు కోరుకుంటున్నారని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
 
మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని  ఈరోజు సతాన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించడంతో ఈ దాడులు ప్రారంభించారని, రేపు మనపై ఈ దాడులను ముమ్మరం చేస్తారని ధ్వజమెత్తారు. దేశంలోని సనాతనధర్మ అనుయాయులు, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి ప్రజలను అడ్డుకోవాలని చెప్పారు. 
 
మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా, రాష్ట్రంలో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.50,700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బినాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశాన్ని మళ్లీ వెయ్యేళ్ల క్రితం ఉన్న బానిసత్వంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.

విపక్ష కూటమికి  నాయకుడు లేడని, నాయకత్వంపై గందరగోళం ఉందని ప్రధాని విమర్శించారు. ”ముంబైలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక పాలసీ రూపొందించారు. భారతీయ సంస్కృతిపై దాడి…భారతీయుల విశ్వాసాలపై దాడి చేయడమే ఇండీ ఎలయెన్స్‌ విధానం” అని మోదీ మండిపడ్డారు. భారతీయుల సంస్కృతి, విశ్వాసాలపై దాడి చేయాలని.. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.

దేశ కోసం ప్రాణాలు అర్పించిన వారు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని వివరించిన ప్రధాని.. దేవి అహల్యాబాయి హోల్కర్‌ వంటి వారికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిన సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార కూటమి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.  సనాతన ధర్మం ఇచ్చిన బలంతో ఝాన్సీ లక్ష్మీబాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడ,ఆమె తన ఝాన్సీ రాజ్యాన్ని వదులుకోనని చెప్పినట్లు ప్రధాని గుర్తు చేశారు.

మరోవైపు, సనాతన ధర్మం తన జీవితానికి ఎంతో అవసరమని మహాత్మాగాంధీ చెప్పారని,  తాను రాముడి నుంచి స్ఫూర్తి పొందానని చెప్పినట్లు తెలిపారు. అందుకే ఆయన కన్నుమూసే సమయంలో హే రామ్ అన్నారని వెల్లడించారు. దేశ అబివృద్ధి కానీ, రాష్ట్రాల అభివృద్ధి పూర్తి పారదర్శకత్వంగా, అవినీతి రహితంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను గుర్తించిన రోజుల్లో రాష్ట్రాన్ని చిరకాలం పాలించిన నేతలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అవినీతి, నేరాలకు నిలయంగా రాష్ట్రం ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయలకు దూరంగా రాష్ట్రం ఉండేదన్న విషయం అప్పటి జనరేషన్ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రోడ్లు, ఇంటింటా విద్యుత్ వెలుగులు వచ్చాయని చెప్పారు.