అంతరాష్ట్ర గంజాయి రవాణా స్మగ్లర్ల కేంద్రంగా హైదరాబాద్

అంతరాష్ట్ర గంజాయి రవాణా స్మగ్లర్ల కేంద్రంగా హైదరాబాద్

దేశంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాకు కేంద్రంగా మారిన హైదరాబాద్ ఇప్పుడు అంతరాష్ట్ర గంజాయి రవాణా స్మగ్లర్లుకు సహితం కేంద్రంగా నెలకొంది.  ఇటీవలి కాలంలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు వరుసగా వేలాది కిలోల గంజాయి పట్టుకుంటుండడంతో హైదరాబాద్ మీదుగా దేశంలో పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు వెల్లడైంది. 

గతంలో దాదాపుగా 50కిలోల వరకు రవాణా చేసేవారు. కానీ ఇటీవలి హైదరాబాద్ మీదుగా రవాణా చేస్తున్న గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. ఏకంగా వందల కిలోల గంజాయి పట్టుబడుతోంది, డిసిఎంలో రవాణా చేస్తున్నారు. వీటిల్లోనే నిందితులు వందల కొద్ది గంజాయిని రవాణా చేస్తున్నారు.  ఎపిలోని అరకు, రాజమండ్రి, ఒడిసాలోని మల్కాన్‌గిరి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

నిందితులు కిలోకు రూ.3,000ల చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.25,000లకు విక్రయిస్తున్నారు.  భారీ ఎత్తున డబ్బులు వస్తుండడంతో పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా గంజాయి రవాణాకు స్మగ్లర్లు వెనుకాడడంలేదు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మహారాష్ట్రకు ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు. వాటితో తన సొంత గ్రామంలో విలాసవంతమైన ఇల్లు కుట్టుకుని జాల్సాలు చేస్తున్నాడు. 

నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అతడి విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న రెండు ముఠాల నుంచి 1,220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ముఠాలు ఎపిలోని అరకు, రాజమండ్రి నుంచి గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్‌కు రవాణా చేస్తున్నాయి. 

వీరికి అసలు నిందితులు లక్షలాది రూపాయలు కమీషన్ ఆశ చూపడంతో గంజాయిని తీసుకుని హైదరాబాద్ మీదుగా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డిసిఎం, కార్లు స్వాధీనం చేసుకున్నారు, వీరు రూ.3,000కిలో చొప్పున కొనుగోలు చేసి తీసుకుని వెళ్లగా మహారాష్ట్రలో ప్రధాన నిందితుడు రూ.25,000లకు కిలో గంజాయి విక్రయిస్తు, భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. 

ఈ రెండు ముఠాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రధాన నిందితుడు కంట్రీమేడ్ పిస్తోల్‌ను కొనుగోలు చేసి తనను అడ్డుకోవాలని చూసిన వారిని బెదిరిస్తూ గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నాడు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడంతో తుపాకీ విషయం బయటపడింది. ఇలా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేసేందుకు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని తరలిస్తున్నారు.

వాహనాల్లో గంజాయి తరలిస్తున్న నిందితులు వాహనాలను పోలీసులు తనిఖీ చేసే సమయంలో పట్టుబడకుండా ఉండేందుకు వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటిలోనే వందలాది కిలోల గంజాయిని లోడ్ చేసి రవాణా చేస్తున్నారు. కార్లలో కూడా డోర్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి దానిలో వందల కిలోల గంజాయిని నింపి రవాణా చేస్తున్నారు. 

బయటికి కూరగాయలు, గాజులు ఏర్పాటు చేసి లోపల గంజాయి పెట్టి రవాణా చేస్తున్నారు. గాజుల బుట్టల్లో పెట్టి నిందితులు ఏకంగా రైలులో గంజాయిని తరలించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు పట్టుకుని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరో కేసులో రాచకొండ పోలీసులు 1,000 కిలోల గంజాయిని డిసిఎంలో పైన కూరగాయాల బాక్సులు కింద గంజాయి పెట్టి తరలిస్తుండగా పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పట్టుకున్నారు.

పోలీసుల తనిఖీ నుంచి తప్పించుకునేందుకు గంజాయి స్మగ్లర్లు ముందుగా కారులో పైలట్ వెళ్తున్నారు. వారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే వెనుక వస్తున్న గంజాయి లోడు ఉన్న వాహనం ముందుకు కదులుతుంది. దీని వల్ల పోలీసుల తనిఖీలు నుంచి తప్పించుకుని సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చును. ఇది ఖరీదైన వ్యవహారమైనా కూడా స్మగ్లర్లు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు.