జీ20 సెక్రటేరియట్‌లో ప్రధాని మోదీ

జీ20 సెక్రటేరియట్‌లో ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జీ20 సెక్రటేరియట్‌లో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ కూడా సెక్రటేరియట్​కు వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులను పలకరించారు. జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

జీ20 సదస్సుకు సంబంధించి తన అనుభవాలను మోదీ అధికారులతో పంచుకోగా, వారు కూడా వారి అనుభవాన్ని ప్రధానితో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా అన్ని స్థాయిల్లోని సిబ్బందితో ప్రధాని సంభాషించారు. భారత్‌ నేతృత్వంలో జీ20 సదస్సు విజయవంతంగా ముగియడం, ప్రపంచ దేశాలు, ఆ దేశాల అగ్రనేతలు భారత్​ను ప్రశంసించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ విజయం వెనక జీ20 సెక్రటేరియట్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారుల కృషి ఎంతో ఉందని ప్రధాని కొనియాడారు. ఈ క్రమంలోనే వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి 114 మంది అధికారులను ఈ సెక్రటేరియట్‌లో నియమించారు. ఆగస్టులో అదనంగా మరో 140 మంది యువ అధికారులను ఇందులో చేర్చారు. ఈ బృందానికి షెర్పా అమితాబ్‌ కాంత్‌, ప్రధాన సమన్వయకర్త హర్ష్‌ ష్రింగ్లా మార్గదర్శకత్వం వహించారు.

పోలీస్ సిబ్బందితో ప్రధాని విందు
 
కాగా, భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ  ప్రత్యేక విందు ప్లాన్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రతి జిల్లా నుంచి కానిస్టేబుళ్ల నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకూ శిఖరాగ్ర సమావేశంలో అద్భుతమైన పని కనబరచిన సిబ్బంది జాబితాను ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ అరోరా కోరినట్లు తెలిపారు. అరోరా సహా మొత్తం 450 మంది సిబ్బంది ఈ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వారంలోనే జీ20 సమ్మిట్‌ జరిగిన భారత్‌ మండపంలో ఈ విందు ఉండే అవకాశం ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి.