అయ్యప్ప దీక్షలో చర్చి ఫాదర్‌ మనోజ్‌

అయ్యప్ప దీక్షలో  చర్చి ఫాదర్‌ మనోజ్‌
ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్  సేవకుడిగా తనకున్న లైసెన్సును వదులుకున్న ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకున్నది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో ఫాదర్‌గా ఉన్నారు.  41 రోజుల పాటు దీక్ష పూర్తిచేసిన అనంతరం ఆయన ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు.
ఇందులో భాగంగా ఇతర భక్తుల్లానే ఆయన కూడా మండల దీక్ష కొనసాగిస్తున్నాన్నారు. ఈ నెల 20న అయ్యప్పను దర్శించుకోనున్నారు. అయితే దీనిపై దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు.  మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యం ఇస్తానని మనోజ్‌ చెప్పారు. తన దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు వివరణ కోరాయని, దీంతో వారిచ్చిన ఐడీ కార్డు, లైసెన్సు తిరిగి ఇచ్చేశానని వెల్లడించారు.

తిరువనంతపురం, బలరామపురం ఉచ్చక్కడకు చెందిన ఫాదర్ మనోజ్ (50) హిందూ మతం, ఆచార వ్యవహారాలు నేర్చుకుంటున్నాడు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సిఎస్ఐ) కమ్యూనిటీలో జన్మించిన ఫాదర్  మనోజ్ 2010లో ఆంగ్లికన్ చర్చిలో ఫాదర్ గా నియమితులయ్యారు. తర్వాతి సంవత్సరాల్లో పిహెచ్ డితో సహా థియాలజీ కోర్సులను పూర్తి చేశారు. 

ఒకరు మరోమతం గురించి తెలుసు కొనేందుకు తన మతాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒకే ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడని ఆయన ఏ చర్చ్ బాధ్యతను కూడా తీసుకోలేదు. విద్యార్థులకు తమ జీవితాలలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం గురించి నేర్పే ప్రయత్నం చేస్తున్నారు.
మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు.  చర్చిలో చేరింది కూడా ఈ ఆలోచనతోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 20న శబరిమల క్షేత్రానికి వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాని పేర్కొన్నారు. చర్చి బాధ్యతలు తీసుకోకముందు మనోజ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు.
బెంగళూరు స్థిరనివాసి అయినా ఫాదర్ మనోజ్ 27 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశారు. ఆయన భార్య జోలీ జొస్ గృహిణి.
కుమార్తె ఆన్ ఐరీన్ జోస్లెట్ డిగ్రీ చదువుతున్నది. `తత్వమసి’ తాత్విక చింతన తనకు అయ్యప్ప పట్ల ఆసక్తి కలిగించినట్లు చెప్పారు.  “శబరిమల సందర్శనకు సంబంధించిన ఆచారాలు, వ్యవహారాల గురించి నేను నా స్వంత పఠనాల నుండి, నా స్నేహితుల ద్వారా నేర్చుకున్నాను. నేను మానసికంగా, శారీరకంగా దానికి సంబంధించిన అన్ని ఆచారాలను అనుసరిస్తున్నాను,” అని ఆయన తెలిపారు. 
“తత్వమసి’ (నువ్వే అది)ని బలంగా విశ్వసించేవాడిని కాబట్టి, నేను ఎప్పుడూ శబరిమల సందర్శించాలని కోరుకున్నాను. ఒక క్రైస్తవుడి కంటే ఎక్కువగా, నన్ను నేను ఆధ్యాత్మిక వ్యక్తిగా గుర్తించుకుంటాను. నా దేవుడి భావన మతపరమైన సరిహద్దులకు అతీతమైనది, ” అని ఆయన స్పష్టం చేశారు.
ఆయన దృష్టిలో దేవుడు ఒక్క్కరే. కేవలం మతాలు వేర్వేరు రూపాలలో చూస్తున్నాయి. అన్ని మతాలు ఒకే అంశాన్ని చెబుతున్నాయి. దేవుడిని మతాల చక్రబంధనలకు పరిమితం చేయలేము. ప్రతివారు ఈ అంశాన్ని గ్రహిస్తే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరింపవచ్చు. అన్ని మతాలు మానవులకు మంచి చేయాలనే చూస్తున్నాయి.