చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691 నంబర్ కేటాయింపు

చంద్రబాబుకు ఖైదీ నంబర్ 7691 నంబర్ కేటాయింపు
స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును రెండు రోజుల సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత ఆదివారం అర్ధరాత్రి 1.16సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.  కోర్టు ఆదేశాల మేరకు బాబు కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్‌ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు.  చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో ఖైదీ నంబర్ 7691 కేటాయించారు.
శుక్రవారం అర్ధరాత్రి మొదలైన హైడ్రామా 48 గంటల ఉత్కంఠ తర్వాత ముగిసింది.  విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో  ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో భారీ వర్షంలోనే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.   సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఐదుగురు సిబ్బందితో భద్రతా కలిగించారు.
ఒక హెడ్ వార్డర్‌తో పాటు నలుగురు సిబ్బందిని చంద్రబాబు ఉంటున్న స్పెషల్ బ్లాక్ వద్ద ఉంచారు.  జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ విధించిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు వయసు రీత్యా ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 
 
జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సూచించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాజమండ్రి జైలుకు చేరిన తర్వాత చంద్రబాబును లోకేష్ పరామర‌్శించారు. 
 
జైలు సిబ్బందికి చంద్రబాబును అప్పగించిన తర్వాత ఎన్‌ఎస్‌జి సిబ్బంది వెనుదిరిగారు. మరోవైపు చంద్రబాబును జైలుకు తరలించడంతో రాజమండ్రిలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాజమండ్రిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు.   బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఈ బంద్‌కి బిజెపి దూరంగా ఉండగా. జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. ఈ కేసులో చంద్రబాబే సూత్రధారిగా భావిస్తున్నామనీ, ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనీ, అందువల్ల వారం పాటూ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ, ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం  వాదన జరిగే అవకాశం ఉంది.
అలాగే చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా ఇవాళ బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారని తెలిసింది. అందువల్ల ఇవాళ ఈ రెండు పిటిషన్లపై వాడివేడి వాదనలు జరిగే అవకాశం ఉంది. బెయిల్ రాకపోతే, చంద్రబాబు సెప్టెంబర్ 22 వరకూ జైలులో ఉంటారు. కస్టడీకి అనుమతిస్తే, ఆయన్ని సీఐడీ అధికారులు, వారంపాటూ ప్రతి రోజూ ప్రశ్నించే అవకాశం ఉంటుంది.