ఎస్పీజీ చీఫ్ ఏకే సిన్హా కన్నుమూత

ఎస్పీజీ చీఫ్ ఏకే సిన్హా కన్నుమూత
ప్రధాని మోదీ భద్రత బాధ్యతలను నిర్వర్తించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్  డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా బుధవారం ఉదయం గురుగ్రామ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రధాన మంత్రి భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యతలను ఎస్పీజీ చూస్తుంటుంది.

అరుణ్ కుమార్ సిన్హా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈ మే 31 వ తేదీన ఆయనకు మరో సంవత్సరం పదవీకాల పొడగింపు లభించింది. అస్వస్థతకు లోను కావడంతో కొన్ని రోజుల క్రితం ఆయనను గురుగ్రామ్ లోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు.

 ఎస్సీజీ 12 వ డైరెక్టర్ గా ఆయన 2016 మార్చి నెలలో బాధ్యతలు స్వీకరించారు. 2024, మే 31 వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, దురదృష్టవశాత్తూ బుధవారం మరణించారు. ఎస్పీజీ చీఫ్ హోదా రాష్ట్ర డీజీపీతో సమానంగా ఉంటుంది.

ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా ఆకస్మిక మృత పట్ల ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయన సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొంది. ఎస్పీజీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు తన రాష్ట్ర కేడర్ అయిన కేరళలో, బీఎస్ఎఫ్ లో పలు కీలక బాధ్యతలను ఏకే సిన్హా చేపట్టారు. 

 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాతప్రధాన మంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు 1985లో ఎస్‌పిజి ఏర్పడింది. ఆ తర్వాత ఎస్‌పిజి పరిధిని తగ్గించి ప్రస్తుతం ప్రధాన మంత్రికి మాత్రమే ఎస్‌పిజి భద్రతను కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో సుమారు 30 వేల మంది సుశిక్షిత సిబ్బంది ఉన్నారు.