ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్ ..

ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్ ..
ఈ నెల 18 నుండి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మన దేశం పేరును `ఇండియా’ నుండి `భారత్’గా మారుస్తూ  ప్రభుత్వం బిల్లు తీసుకు వస్తున్నట్లు ఒక వంక విశేషంగా ప్రచారం జరుగుతూ ఉండగా, మరోవంక ఈ విషయమై మౌనం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం కొంతకాలంగా `భారత్’ అని వాడుతూ ఆచరణకు పూనుకున్నట్లు స్పష్టం అవుతుంది.

ఇప్పటికే, ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు  సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. అయితే, ఇలా అధికారిక కార్యక్రమాల ఆహ్వాన పత్రికల్లో ‘ఇండియా’కు బదులుగా ‘భారత్‌’ అని ప్రస్తావించడం ఇది మొదటి కాకపోవడం గమనార్హం.

గత ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రీస్‌ను కూడా సందర్శించారు. ఆగస్ట్ 22-25 మధ్య ఆయన రెండు దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లో కూడా ఆయనను ‘ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అనే పేర్కొన్నారు.

కాగా, ఇండోనేషియాలో బుధవారం నుంచి జరగనున్న ఆసియాన్‌ సదస్సు ఆహ్వాన పత్రికలో కూడా ‘ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ ఇండియా’కు బ‌దులుగా ‘ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భార‌త్’ ‌అనే ప్రస్తావించారు. ప్రధాని మోదీ నేడు ఇండోనేషియా పర్యటనకు బయలుదేరుతున్నారు. అక్కడ జ‌రిగే 20వ ఆసియ‌న్‌-ఇండియా స‌మ్మిట్‌లో ఆయ‌న పాల్గొంటారు. 

దీనితో పాటు 18వ ఈస్ట్ ఏషియా స‌ద‌స్సులోనూ ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఆ వేడుక‌ల కోసం రూపొందించిన ఆహ్వాన ప‌త్రిక‌లో ‘ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భార‌త్’‌గా రాశారు. దేశం పేరును మార్చాల‌ని కేంద్ర స‌ర్కార్ భావిస్తున్న నేప‌థ్యంలో ఆసియాన్ ఇన్విటేష‌న్ లేఖ‌లో ప్రైమ్‌ మినిస్టర్ ఆఫ్ భార‌త్‌గా పేర్కొన‌డం మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నది.

రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఇండియా పేరును భార‌త్‌ గా మార్చే ప్రక్రియ‌ను కేంద్ర ప్రభుత్వం చేప‌డుతోందని,  ఇండియా పేరు మార్చుతూ స‌భ‌లో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ స‌ర్కార్ పావులు క‌దుపుతోంద‌ని వార్తలు వస్తున్న సమయంలో ఈ ఆహ్వానాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.