జమిలి ఎన్నికల నిర్వహణపై కమిటీలో అమిత్‌ షా, ఆజాద్

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించి  8 మంది సభ్యులతో శనివారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

దీని ప్రకారం ఈ కమిటీలో కేంద్రమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్ చౌదరి‌, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాశ్‌ కశ్యప్‌, సీనియర్‌ లాయర్‌ హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారి సభ్యులుగా ఉండనున్నారు.

ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి నిరాకరించారు.

‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’తో ఒకేసారి లోక్‌సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికల అంశంపై నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నేతలతో కమిటీ సమావేశం కానున్నదని, వారి అభిప్రాయాలు తీసుకొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ, అసెంబ్లీలే కాదు.. మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఒకే ఓటరు జాబితా, ఒకే ఓటరు కార్డు ఉండాలని అభిలషిస్తోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను సిఫారసు చేస్తుందని కేంద్రం పేర్కొంది.

అయితే, కమిటీ తన నివేదికను అందించడానికి నిర్దిష్టమైన కాలపరిమితిని విధించలేదు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని సూచించింది. ఈ మేరకు కమిటీకి ఏడు విధివిధానాలను కేంద్రం ఖరారు చేసింది.

విధివిధానాలు

జమిలి ఎన్నికల విధానం కొనసాగడానికి తగిన రక్షణ చర్యలను సిఫారసు చేయడం. జమిలి విధానానికి విఘాతం కలగకుండా ఉండేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించడం.

జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన మానవ వనరులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాల వంటి వాటిపై అధ్యయనం

లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకే ఓటరు జాబితా, ఎన్నికల గుర్తింపు కార్డు జారీపై విధివిధానాలను సిఫారసు చేయడం.

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్న తర్వాతి రోజునే జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొన్నది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. 2017లో రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా మోదీ అభిప్రాయానికి మద్దతు పలికారు. 

2018లో పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వరుసగా ఎన్నికల జరుగుతుండటం వలన ఆర్థికంగా భారం అవడంతో పాటు మానవ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని, ఇదే సమయంలో వరుస ఎన్నికలతో అమల్లోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియామావళి వలన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ జరుగాలని, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.