కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టిన భౌతిక శాస్త్రవేత్తలు

అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్‌-28 ను గుర్తించింది.  ఇది ఆక్సిజన్‌ పరమాణువుకు సంబంధించిన ఒక కొత్త రకం ఐసోటోప్‌ అని సైంటిస్టులు తెలిపారు. 
ఈ ఆక్సిజన్‌-28 ఐసోటోప్‌ 20 న్యూట్రాన్‌లను, ఎనిమిది ప్రోటాన్‌లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ రకాల్లో ఈ ఆక్సిజన్‌ పరిమాణంలో పెద్దదిగా చెప్పవచ్చు.  అయితే ఈ ఆక్సిజన్‌ ఐసోటోప్‌ అంచనాల కంటే కొంత తక్కువ స్థిరత్వాన్నే కలిగి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, అణు భౌతిక శాస్త్రంలో ఇది ప్రధానమైన డిస్కవరీ అంటున్నారు.

ఇరవై న్యూట్రాన్‌లు (ఎన్=20), ఎనిమిది ప్రోటాన్‌లు (జెడ్ =8) కలిగి ఉండి చాలాపెద్ద న్యూట్రాన్‌, ప్రోటాన్‌ నిష్పత్తిగల ఈ ఆక్సిజన్‌ ఐసోటోప్‌ను ప్రకృతిలో అసాధారణమైనదిగా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్‌ అణు ప్రయోగాలకు ఈ ఐసోటోప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.