
రానున్న లోక్‌సభ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు సమైక్యంగా పోటీచేయాలని ఇండియా కూటమి పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాలలో సీట్ల పంపకం ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని, ఇచ్చి పుచ్చుకునే రీతిలో సమైక్య స్ఫూర్తితో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఇండియా కూటమి పార్టీలు శుక్రవారం ముంబైలో జరిగిన రెండో రోజు సమావేశంలో తీర్మానించాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాధ్యమైనంత త్వరలో ప్రజా సమస్యలపై బహిరంగ సభలు, ర్యాలీలు సమైక్యంగా నిర్వహించాలని కూడా తమ కూటమి తీర్మానించినట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదాన్ని వివిధ భాషలలో ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, తమ ప్రచార వ్యూహాలను సమన్వయంతో చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
ఇండియా కూటమి సమన్వయ కమిటీని శుక్రవారం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ ఖాన్, జేడీయూ నేత లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కన్వీనర్‌ను ప్రకటించలేదు.
అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో కూడిన నాలుగు ప్రధాన కమిటీలను ఈ సమావేశంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రచార కమిటీ, సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చి కమిటీలను కూడా నియమించామని తెలిపారు.
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. భాగస్వామ్య పార్టీల కమ్యూనికేషన్స్, మీడియా స్ట్రాటజీలను సమన్వయం చేసుకోవాలని, ఈ ప్రచార కార్యక్రమాలను స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా, లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారని నిలదీసింది.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే