ఒకే దేశం.. ఒకే ఎన్నిక కోసం కమిటీ ఏర్పాటు

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కోసం కమిటీ ఏర్పాటు
జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై అధ్యయనానికి శుక్రవారం కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. జమిలీ ఎన్నికలపై కోవింద్ అధ్యక్షతన కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత నివేదికను సమర్పించనుంది. 
 
సెప్టెంబరు 18 నుంచి 22 వరకూ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటన చేసిన మర్నాడే జమిలీ ఎన్నికలపై కేంద్రం కమిటీ వేయడం గమనార్హం. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ప్రకటన వెలువడినప్పటి నుంచి ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’కి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 
 
అయితే, ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకూ దీనిని ధ్రువీకరించలేదు. మరోవైపు, ముందస్తు ఎన్నికలు డిసెంబ రలో వస్తాయని `ఇండియా’ కూటమి నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కూడా అందుకోసమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
 
‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు ఎప్పటి నుంచో కేంద్రం మద్దతు తెలుపుతుంది. జమిలీ ఎన్నికలకు లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. షెడ్యుల్ ప్రకారం డిసెంబ‌రులోపు తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్, రాజస్ధాన్, మ‌ధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నిక‌లు జరగాల్సి ఉంది. 
 
ఆ త‌ర్వాత మరో ఆరు నెలల్లోనే సార్వత్రిక ఎన్నిక‌లతో పాటు ఏపీ, ఒడిశా సహా మరో 4 రాష్ట్రాల ఎన్నిక‌లు జరుగతాయి. ఇంకా జమ్మూ కశ్మీర్ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కేంద్రం చెబుతోంది. అంటే పది రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో రెండుసార్లు ఎందుకు అన్నింటినీ ఒకేసారి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేంద్రం ఉందని చెబుతున్నారు. 
 
మహారాష్ట్రలో రాజకీయాల్లోనూ అనిశ్చితి నెలకుంది. దీంతో ఆ ఎన్నికలు కూడా ఒకే సారి పెట్టేస్తే పనైపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో వెల్లడించారు. ఆ సవరణల కోసమే ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
అయితే, ఈ ప్రత్యేక సమావేశాల్లో 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.  ఈ పార్లమెంటు సమావేశాలు 17వ లోకసభలో 13 సెషన్ కాగా,  రాజ్యసభలో 261వ ఎడిషన్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.