
ప్రఖ్యాత హిందూ ధర్మక్షేత్రం టిటిడి పాలకమండలి సభ్యులు అంటే వెంకన్న సేవకు వచ్చామనే భావన వారిలో ఉండాలని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనపై భక్తిని చాటుకున్న తన భజన బృందానికి మాత్రమే పాలక మండలిలో చోటు ఇచ్చారని బీజేపీ రాష్త్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో హిందువుల పై సీఎం జగన్ కక్ష కట్టారని ఆమె ధ్వజమెత్తారు. `మేమేమి పాపం చేసాం? మాకెందుకు ఇంత క్షోభ?” అని రాష్ట్రంలోని హిందువులు ఆవేదన చెందుతున్నారని ఆమె తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యులకు స్వామివారిపైనా భక్తిశ్రద్ధలు, భక్తుల అవసరాలను తీర్చి హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ, వ్యాప్తి చేసే సభ్యులు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
కానీ టిటిడి బోర్డులో ఎంతమందికి వెంకన్నపై భక్తి ఉంది? వారంతా ఏనాడైనా రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి పని చేశారా? అంటూ ఆమె సీఎం జగన్ ను ప్రశ్నించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి నియామకం కూడా తీవ్రంగా ఖండించదగ్గ విషయం అని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ఆయన వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని వ్యాఖ్యలు చేశారని యామినీ శర్మ గుర్తు చేశారు. వారి ఇంట్లో క్రైస్తవ సంప్రదాయంతో పెళ్లిళ్లు, వేడుకలు చేస్తారని పేర్కొంటూ ఇటువంటి వ్యక్తులకు వెంకన్న పై భక్తి ఎందుకు ఉంటుంది” అంటూ ఆమె నిలదీశారు. సీఎం జగన్ తన స్వార్దం కోసం హిందువులను అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మరొకరు, శరత్ చంద్రారెడ్డి మద్యం కేసులో ఈడీకి లొంగిపోయారని, అరెస్టు అయ్యారని ఆమె గుర్తు చేశారు. అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తిని ఎలా నియమించారు? అంటూ ఆమె ప్రశ్నించారు.
సీఎం జగన్ ఒక ప్రణాళిక ప్రకారమే హిందూ ధర్మంపై కక్ష పెంచుకుని ఇలా చేస్తున్నారని బిజెపి నేత స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను ధ్వంసం చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుందని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా నేరాలు చేసే వారే టీటీడీ పాలకమండలికి అర్హులా? అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
నేరస్తులు ఉండేందుకు వీలుగా ఉండే బోర్డింగ్ స్కూల్ గా టీటీడీని భావిస్తున్నారా ? వేల కోట్లు ఆదాయం వచ్చే టీటీడీలో ఆర్దిక మోసగాళ్లను నియమిస్తారా? అని ఆమె ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, సానుభూతి పరులను నియమించుకోవడం ఎంతవరకు సమంజసం? అంటూ ఆమె మండిపడ్డారు. ధార్మిక ప్రచారం, భక్తి ఉన్న వారిని నియమించాలని బీజేపీ నేత స్పష్టం చేశారు. అసలు టీటీడీ బోర్డులో ఉండాలంటే అర్హతలు ఏమిటో చెప్పాలి? అని ఆమె డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాజకీయ నాయకులకు ఇస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
జగన్ సలహాదారుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు ఆయన సామాజిక వర్గం వారే కనిపిస్తారా? ఇతర వర్గాలలో ఉన్న వారికి ప్రతిభ, నైపుణ్యం, భక్తి లేదంటారా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. తమ అనుచరులకు రాజకీయ పదవులు ఇవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయని చెబుతూ, ఆలయాల్లో కళంకితులకు బాధ్యఇవ్వకూడదని ఆమె స్పష్టం చేశారు.
More Stories
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి