
చంద్రయాన్-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉత్సాహంతో మరికొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనున్నది.
సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఆదిత్య ఎల్-1 సిద్ధమైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన తెలిపారు.
“ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ సి 57 వాహకనౌక … ఆదిత్య ఎల్ 1ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ , ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది” అంటూ వివరించారు.
ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్లనున్నది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఉపయోగపడనున్నాయి.
సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేస్తున్నది. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది.
ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. రోదసిలో సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ పంపిస్తున్న తొలి అబ్జర్వేటరీ స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా సూర్య వ్యవస్థ గురించి ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి.
ఆదిత్య ఎల్-1 పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్నది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ప్రయోగం కోసం రెండువారాల కిందటే పేలోడ్స్ ఏపీ శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. వచ్చే నెల 2న ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు