అంధుల క్రికెట్‌ లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు

అంధుల క్రికెట్‌ లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు

విశ్వ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐబిఎస్‌ఎ) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 

శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. వర్షం అంతరాయాల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా వర్షం కారణంగా భారత్ విజయలక్ష్యాన్ని 42 పరుగులకు కుదించారు.

ఈ లక్షాన్ని కేవలం 3.3 ఓవర్లలో ఒకే వికెట్‌ను కోల్పోయి ఛేదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌తొలి చాంపియన్‌గా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన భారత్ ఫైనల్‌తో కలుపుకొని ఆస్ట్రేలియాపై 3 సార్లు, ఇంగ్లాండ్‌పై రెండు సార్లు గెలిచింది. 

మరో వైపు  ప్రపంచ క్రీడల్లో అంధుల మహిళల క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో భారత్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన భారత మహిళల అంధుల జట్టు అజేయంగా నిలిచింది. ప్రారంభంలో ఆస్ట్రేలియాను 8 వికెట్లతో ఓడించి సత్తా చాటిన భారత్‌, ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 185 పరుగుల తేడాతో చిత్తుచిత్తు చేసింది.

ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టు తరఫున తెలంగాణ నుంచి సంధ్య, సత్యవతి, రవన్ని బరిలో దిగారు. ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌స్వామికి చెందిన నేత్రవిద్యాలయ విద్యార్థులు కావడం విశే షం. వైకల్యం అడ్డంకిగా మారినా మెండైన ఆత్మవిశ్వాసంతో యావత్తు దేశం గర్వపడేలా తమదైన ప్రతిభతో వీరు ఆకట్టుకున్నారు. 
 
తొలిసారి జరిగిన మహిళల క్రికెట్‌లో సత్తాచాటుతూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ అప్రతిహత విజయాల్లో వీళ్లు కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్‌ గడ్డపై చరిత్ర లిఖించిన సంధ్య, సత్యవతి, రవన్నికి చినజీయర్‌స్వామి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. 
దీనికి తోడు మిగతా భారత క్రికెటర్లకు రెండు లక్షల పారితోషకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆహారం విషయంలో ఇంగ్లండ్‌లో ఇబ్బందులు పడ్డ ఈ క్రికెటర్లకు వీటీ సేవ అద్భుత సేవలు అందించింది.