ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం

ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం

చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఓణాల్లో జీవితకాలంలో ఒక్కసారే సంభవిస్తాయని, ఇది నిజంగా గర్వించదగ్గ సందర్భమని ఆమె ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. దేశం యావత్తు గర్వించేలా చేసిన మధుర క్షణమిదని ఆమె తెలిపారు. గోవాలో అధికార పర్యటనలో ఉన్న రాష్ట్రపతి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగడాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన అనంతరం ఇస్రో బృందానికి వీడియో సందేశం ద్వారా తన అభినందనలు తెలియజేశారు.

‘చరిత్ర సృష్టించిన రోజులు ఉన్నాయి. చంద్రయాన్ మిషన్‌ను విజయవంతం చేయడం ద్వారా మన శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించడమే కాకుండా భౌగోళిక స్వరూపాన్నే తిరగరాశారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘భారత దేశం గర్వించేలా చేసే ఇలాంటి ఘటనలు జీవితంలో ఒకసారే సంభవిస్తాయి. ఇస్రోను ఈ మిషన్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆమె తన సందేశంలో తెలిపారు.

కాగా, భారత్‌ రూ.600 కోట్ల వ్యయంతో చంద్రయాన్-3 మిషన్  చేపట్టింది. జూలై 14న లాంచ్ వెహికల్ మార్క్-III రాకెట్‌ ద్వారా దీనిని నింగిలోకి ఇస్రో పంపింది. 41 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన చంద్రయాన్‌-3 ఎట్టకేలకు ఆగస్ట్‌ 23న సాయంత్రం 6 గంటలకు దాని గమ్యమైన చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగింది.