పోలవరంలో అనూహ్యంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

పోలవరంలో అనూహ్యంగా పెరిగిన గోదావరి నీటిమట్టం
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇంద్రావతి, సీలేరు, శబరి, మంజీర, ప్రాణహిత, ఉప నదుల నుంచి వరద జలాలు గోదావరిలో కలుస్తుండడం వల్ల గోదావరి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. భద్రాచలం నుంచి దిగువకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.
 
బుధవారం నాటికి మరింత పెరిగే అవకాశాలున్నాయని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. అదనంగా వస్తున్న వరద జలాలను పోల వరం ప్రాజెక్టు అధికారులు దిగువకు విడు దల చేస్తున్నారు. మంగళవారం 4,93,972 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగు వకు విడుదల చేసినట్టు ఈఈ పి.వెంకట రమణ తెలిపారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం రాను న్న 24 గంటల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి.
 
గోదావరి నదిలో నీటి ఉధృతి పెరుగుతుండడంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. దీంతో కొయిదా, కట్కూరు, కాకిసనూరు, బోళ్లపల్లి, టేకూరు తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రెండ్రోజులుగా గోదావరి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో భద్రాచలం వద్ద ఆరు అడుగుల మేర ప్రవాహం పెరిగింది. 
 
సోమవారం సాయంత్రం నాటికి 26 అడుగులు ఉన్న నీటి మట్టం మంగళవారం సాయంత్రం నాటికి 32 అడుగులకు చేరుకుంది. అక్కడ నుంచి దిగువకు 3.9 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.  ఏలూరు జిల్లాలోని ఎద్దువాగు, గుండేటి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎద్దువాగు పొంగడంతో వేలేరుపాడు మండలంలోని బోళ్లపల్లి, చిగురుమామిడి మధ్య ఉన్న కాజ్‌వేపై వరద నీరు చేరింది. దీంతో, కొయిదా, కట్కూరు, కాకిసనూరు, బోళ్లపల్లి, టేకూరు తదితర 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 
 
కుక్కునూరు, దాచారం మధ్య గుండేటి వాగుపై ఉన్న కాజ్‌వే నీట మునగడంతో బెస్తగూడెం, సీతారామపురం, నెమలిపేట, గుణ్ణంబోరు తదితర గ్రామాలకు ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఈ గ్రామాలకు 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వరద నీరు చేరడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ ఆలయం మూడు రోజులుగా ముంపులోనే ఉంది. 
 
కాటన్‌ బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ 175 గేట్లను పైకి లేపి 3.8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో రానున్న 24 గంటల్లో మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. దేవీపట్నం కాఫర్‌ డ్యాం బ్యాక్‌ వాటర్‌ కారణంగా వరద నీరు వెనక్కి ఎగదన్నుతోంది. శనివారం నుంచి గండిపోశమ్మ ఆలయానికి రాకపోలు నిలిచిపోయాయి. వరద పెరగడంతో పాపికొండల విహార యాత్రకు వెళ్లే బోట్లను ఎక్కడిక్కడ ఒడ్డుకు నిలిపివేశారు. వరద పెరగడంతో దేవీపట్నం మండలం పలు గ్రామాల ప్రజలు కొండలు, గుట్టలపైకి చేరుతున్నారు.