రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మృతి

రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మృతి
వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మరణించారు. ఒక పైలట్‌ విమానాశ్రయంలో చనిపోగా, మరొక పైలట్‌ విమానంలో గుండెపోటు వల్ల మరణించాడు. ఇండిగో ఫ్లైట్‌ కెప్టెన్ గురువారం నాగ్‌పూర్ నుంచి పూణేకు విమానాన్ని నడపాల్సి ఉంది. బోర్డింగ్‌ గేట్‌ వద్దకు చేరుకున్న అతడు అక్కడ స్పృహకోల్పోయాడు. 
 
వెంటనే హాస్పిటల్‌కు తరలించగా ఆ పైలట్‌ అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.  ఇండిగో పైలట్‌ బుధవారం రెండు సెక్టార్స్‌లో విమానాలు నడిపినట్లు తెలిసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల మధ్య త్రివేండ్రం నుంచి పూణే మీదుగా నాగ్‌పూర్ వరకు విమానం నడిపాడు.  ఆ తర్వాత 27 గంటలపాటు విశ్రాంతి తీసుకున్నాడు.
గురువారం నాలుగు సెక్టార్లలో విమానాలు నడుపాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు తొలి ఫ్లైట్‌ను టేకాఫ్‌ చేయాల్సి ఉంది. అయితే ఆ పైలట్‌ బోర్డింగ్‌ గేట్‌ వద్ద కుప్పకూలి మరణించాడు. మరోవైపు ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో పని చేస్తున్న భారతీయ పైలట్‌ బుధవారం ఢిల్లీ-దోహ విమానంలో అదనపు క్రూ సిబ్బందిగా ప్రయాణించాడు.
అయితే గుండెపోటు రావడంతో విమానంలోనే చనిపోయాడు.  ఆ పైలట్‌ ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు ముందు స్పైస్‌జెట్, అలయన్స్ ఎయిర్, సహారాలో పని చేశాడు. కాగా, ఇద్దరు భారతీయ పైలట్ల మరణాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.