
తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న ఈ యాత్రలను ప్రారంభించి, అక్టోబర్ 2న ముగించేందుకు కార్యాచరణ చేస్తుంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరకి వస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు బస్సు యాత్ర చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్ర చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. యాత్రకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్, ఎన్నికల కమిటీ సహా ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణ బాధ్యత వహించిన వీరేందర్‌గౌడ్, దీపక్‌రెడ్డి, పాపారావు, విక్రమ్ గౌడ్‌లకు బస్సు యాత్ర నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ యాత్రలు దోహదపడుతాయని ముఖ్యనేతలు భావిస్తున్నారు.
ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఒక బస్సు యాత్ర, దక్షిణ తెలంగాణలోని గద్వాల నుంచి ఒక బస్సు యా త్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం నుంచి ఒక బస్సు యాత్ర ప్రారంభించేలా రూపకల్పన చేస్తోంది. ఈ మూడు యాత్రలకు రాష్ట్ర పార్టీ కీలక నేతలు సారథ్యం వహించనున్నారు.
పదిహేను రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్క బస్సు యాత్ర ప్రతి రోజూ రెండు అసెంబ్లీ కేంద్రాల్లోకి వెళ్లేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు.
బిఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై ధ్వజమెత్తుతునే ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్ర సహాయంపై ప్రజలకు వివరించనున్నారు. యాత్రల పేరుతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత