కేసీఆర్ ప్రభుత్వం భూములు అమ్మి ఆ డబ్బులతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వందల ఎకరాల భూములను అమ్మకాలను రోజువారీ కార్యక్రమంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. మోకిల, కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిబట్ల లాంటి అనేక చోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు వేలంలో కట్టబెడుతుందని మండిపడ్డారు.
మూడు నెలల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని తెలిసి భూముల విక్రయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు జాగా లేదని చెబుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కోసం సర్వే నంబర్ 503లో 10 ఎకరాల స్థలాన్ని ఎలా కేటాయించిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే సైన్స్ సిటీకి మాత్రం భూమి ఇవ్వమంటే ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కై అక్రమంగా భూములు పంచుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు 11 ఎకరాలు, ప్రతిపక్ష కాంగ్రెస్కు 10 ఎకరాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పద్ధతిలో భూమి ఇచ్చామో, అదే విధంగా బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు కేటాయించామని జీవో కూడా ఇచ్చారని గుర్తు చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూములు అమ్మితే ప్రస్తుత మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ భూములు అమ్ముతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, ఈ-వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ జాగాలను అమ్ముకుంటున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి భూములు కావాలని కేంద్రం లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
రైల్వే టెర్మినల్, చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణకు స్థలం అడిగితే లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీకి భూమి ఇచ్చేందుకు మనసు వస్తుంది కానీ, పేదల ఇండ్లకు ఇచ్చేందుకు మనసు రాదు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువైన భూములను అక్రమంగా తీసుకున్నాయని ఆరోపించారు.
కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు పలుకుతుంటే, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలు తీసుకుందని గుర్తు చేశారు. గతంలో ఫార్మాసిటీ పేరుతో అసైన్డ్ భూములను, పేదల భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటే హైకోర్టు రద్దు చేసిందని చెప్పారు. ప్రభుత్వ భూముల అమ్మకం రాష్ట్ర భవిష్యత్ కు మంచిది కాదని కేంద్ర మంత్రి హెచ్చరించారు.
భూముల వేలాన్ని బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేసిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని ధ్వజమెత్తారు.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్