
ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడరాదనే మౌన వ్రతాన్ని చేపట్టారని, ఆ వ్రతాన్ని భగ్నం చేసేందుకే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారని ప్రతిపక్ష ఇండియా కూటమి పేర్కొంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ ప్రారంభిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపారు. మణిపూర్ తగులబడుతోందంటే భారత్ తగులబడినట్లేనని గొగోయ్ స్పష్టం చేశారు.
మణిపుర్ సీఎం బీరేన్ సింగ్‌ను పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రెండువర్గాల మధ్య ఘర్షణలు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని స్వయంగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధాని అసలు విషయాలపై మాట్లాడకుండా ఇండియా కూటమిపై విమర్శలు చేస్తున్నారని గౌరవ్ గొగోయ్ ఆక్షేపించారు.
ప్రజా సమస్యలపై మోదీ మౌనం కొత్తేమీ కాదంటూ సాగుచట్టాలపై రైతులు ఆందోళన చేసినపుడు మౌనంగానే ఉన్నారని, అదానీపై విమర్శలు వచ్చినపుడు మౌనంగానే ఉన్నారని గుర్తు చేశారు. చైనా బలగాలు భారత్ లోకి వచ్చినపుడు, పుల్వామా ఘటన సమయంలో కూడా మోదీ మౌనంగానే ఉన్నారని వివరించారు. మరో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు మనీశ్ తివారీ మాట్లాడుతూ మణిపూర్ వ్యూహాత్మకంగా కీలక మైన రాష్ట్రమని చెబుతూ ఈశాన్య భారతంలో ఎక్కడ అలజడి చెలరేగినా దాని ప్రభావం దేశ భద్రతపై పడుతుందని తెలిపారు.
తమ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ల ప్రయోజనాల కోసమే విపక్ష నేతలు అవిశ్వాసం ప్రవేశపెట్టారని బీజేపీ నేత నిషికాంత్ దుబే ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రపంచ నేతగా ఎదిగారని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమంలో పురోగమిస్తోందని చెబుతూ ఇలాంటి వేళ అవిశ్వాసం పెట్టాల్సిన అవసరమే లేదని కేంద్రమంత్రి రిజిజు స్పష్టం చేశారు.
తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకున్న ప్రతిపక్షాలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తల్లో ప్రధాని మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాల్సిందిగా ఆదేశించినట్టు రిజిజు తెలిపారు. అది ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తూ గత 97 రోజుల్లో ఎంతమంది మంత్రులు మణిపూర్‌లో పర్యటించాలో చెప్పాలని నిలదీశారు. మణిపూర్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇంతటి విధ్వంసం జరిగిందని ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే ఆరోపించారు. మణిపూర్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మణిపుర్‌లో అక్కడి ప్రభుత్వమే పెద్ద సమస్యని విమర్శించారు.
కాగా, ప్రధాని మోదీ అతి తక్కువ సార్లు సభకు హాజరు కావడం ద్వారా రికార్డు సృష్టించారని సిసిఎం సభ్యుడు ఎఎం ఆరిఫ్ విమర్శించారు. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమయినందునే సుప్రీంకోర్టు మణిపూర్‌లో బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించాల్సి వచ్చివదని పేర్కొన్నారు. బాధ్యత గల ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను చూసి ఆవేదన చెందారని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా డిఎంకె ఎంపి టిఆర్ బాలు తెలిపారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్