
* ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం తీవ్రస్థాయి చర్చ అనంతరం ఓటింగ్‌లో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీనితో ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం దక్కినందున దీనికి పార్లమెంట్ సమ్మతి లభించింది. చట్టం కానుంది. బిల్లుకు నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజెడి, జగన్మోహన రెడ్డి సారధ్యపు వైఎస్ఆర్సిపి మద్దతు తెలిపాయి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం ప్రవేశపెడుతూ ఈ బిల్లు రాజ్యాంగబద్దమని, ఏ విధంగా కూడా సుప్రీంకోర్టు సంబంధిత విషయంపై వెలువరించిన తీర్పునకు భంగకరం కాదని స్పష్టం చేశారు. అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్షం ఈ ఆర్డినెన్స్ చెల్లనేరదని పేర్కొంటూ దీనికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకువచ్చింది.
బిల్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, దేశ రాజధానిలో పాలన అత్యంత కీలకం. అని ఇక్కడి వ్యవహారాలలో పారదర్శకతకు , అవినీతి రహిత సుపరిపాలనకు దీనిని తీసుకురావడం జరిగిందని సభకు అమిత్ షా తెలిపారు. నేషనల్ క్యాపిటల్ టెరిషియరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 202౩కు లోక్‌సభ గత వారం ప్రతిపక్ష ఇండియా కూటమి వాకౌట్ నడుమ ఆమోదం తెలిపింది.
ఇప్పుడు ఈ బిల్లు రాజ్యసభకు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు అమిత్ షా తెలిపారు. ఇప్పుడు దీనిని కాంగ్రెస్ కేవలం రాజకీయ కారణాలతో, ఆప్ ను ప్రసన్నం చేసుకోవడం కోసమే వ్యతిరేకిస్తోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన బిల్లులో మార్పులు తీసుకువచ్చి ఇప్పుడు కొత్తగా దీనిని తెచ్చినట్లు చెప్పారు.
రాజ్యసభలో బీఆర్ఎస్పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఢిల్లీ లిక్కర్ కుంభకుణంలో ఆప్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత నేత కేశవరావు తమకు ఏ పార్టీతో సంభందం లేదని అంటారు కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇద్దరూ ఒక్కటయ్యారని దుయ్య బట్టారు.
ఢిల్లీలో పోస్టింగుల బదిలీల విషయంలో గతంలో ఎలాంటి గొడవులు లేవనని, ముఖ్యమంత్రులతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అమిత్‌షా పేర్కొన్నారు. 2015లో ఒక ఆందోళన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కేంద్రం తమ హక్కులను లాక్కోవాలని చూస్తోందంటూ కొందరు మాట్లాడారని ఆప్ నేతలపై ధ్వజమెత్తారు. అయితే ఆవిధంగా చేయాల్సిన పని కేంద్రానికి లేదని, దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీపై అమిత్‌షా విమర్శలు గుప్పిస్తూ, ఎమర్జెన్సీ తెచ్చేందుకు తాము రాజ్యాంగ సవరణలు చేపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు వారికి లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో సర్వీసులతో అన్ని అంశాలపైన పార్లమెంటుకు అధికారం ఇస్తూ గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసిందని గుర్తు చేశారు. తాము తీసుకువచ్చిన ఢిల్లీ సర్వీసుల బిల్లు ప్రధాన ఉద్దేశం అవినీతిపై పోరాడేందుకేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ ఒడిలో పడిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతకు ముందు ఈ బిల్లుపై ఆప్ నేత రాఘవ ఛద్దా స్పందిస్తూ ఈ బిల్లు కేవలం రాజకీయ విద్రోహ చర్య అని, రాజ్యాంగ పాపం అని, దేశ రాజధానిలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను దొడ్డిదారిన కేంద్రం లాక్కునేందుకు చేపట్టిన చర్య అని విమర్శించారు.
ఈ బిల్లుపై ఆప్, కాంగ్రెస్‌లు తమ సభ్యులకు విప్‌లు వెలువరించాయి. రాజ్యసభలో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ సవరణల బిల్లు సరైనదే అని, ఇందులో అక్రమమేమీ లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. రాజ్యసభ ఎంపి అయిన గగోయ్ సోమవారం రాజ్యసభలో దీనిపై చర్చలో మాట్లాడారు.
ఇది కోర్టులో ఉన్న విషయం ఏమీ కాదని, సుప్రీంకోర్టు ముందున్నది కేవలం సంబంధిత ఆర్డినెన్స్ చెల్లుబాటు విషయం అని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చెల్లుబాటు గురించి చర్చ జరుగుతోందని ఈ న్యాయకోవిదులు తెలిపారు. తాను నామినేటెడ్ సభ్యుడిని అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, బిల్లు రాజ్యాంగబద్ధత గురించే తాను చెపుతున్నానని స్పష్టం చేశారు. ఈ బిల్లు అవసరం అనవరం గురించి తాను మాట్లాడబోనని, కేవలం దీని చట్టబద్ధతపైనే వాదన విన్పించానని వివరించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్