
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సందిగ్ధత తొలగింది. ఆర్టీసీ విలీనం బిల్లు డ్రాప్టుకు గవర్నర్ డా. తమిళిసై ఔందరాజన్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. శానససభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో బిల్లుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
ఆదివారం మధ్యాహ్నం రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ అధికారులతో రాజ్‌భవన్‌లో అర్ధగంటకు పైగా జరిగిన చర్చల అనంతరం గవర్నర్ సానుకూలంగా స్పందించారు. డ్రాఫ్టు బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తలెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన వివరణతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని, వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని గవర్నర్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రెండు సార్లు వివరణ వెళ్లినా ఆమె సంతృప్తి చెందకపోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వడంతో ఆమె సంతృప్తి చెందారు.
ఆ తర్వాత రవాణాశాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్‌తో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించడంతో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు రవాణా మంత్రి అజయ్ కుమార్ ప్రకటించారు.
ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న బిల్లు డ్రాఫ్ట్‌ను రాజ్‌భవన్‌కు పంపారు.
దీనిపై గవర్నర్ రెండు సార్లు సందేహాలను వ్యక్తంచేస్తూ వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. గవర్నర్ తీరును నిరసిస్త ఆర్టీసీ కార్మికులు శనివారం చలో రాజ్‌భవన్ కూడా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పూట రెండు గంటలపాటు బస్సులను నిలిపేశారు. రాజ్‌భవన్‌కు వచ్చిన కార్మికుల తరఫున పది మంది నాయకులతో చెన్నైలో ఉన్న గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అనంతరం గవర్నర్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్ మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. ఈ విషయంపై మరింత స్పష్టత కోరడంతో ఇవాళ రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌తో సమావేశమై వివరణ ఇచ్చారు. వారి వివరణతో సంతృప్తి చెందిన తమిళిస బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ బిల్లుకు ఓకే చెప్పారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి