
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. కుల్గాంలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
గాలింపు కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిపోవడంతో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మరణించారని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదనపు సైనిక బలగాలతో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.
ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు అరెస్ట్
మరోవంక, జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను ( పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. వారివద్ద మూడు హాండ్ గ్రనేడ్లు, పది తుపాకీలు, 25 ఏకే-47 రౌండ్లు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనగర్ పట్టణంలో ఉగ్రవాద కార్యక్రలాపాలను విస్తృతం చేయడానికి వారు కుట్రపట్టారని పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా వారిని బారాముల్లాకు చెందిన ఇమ్రాన్ అహ్మద్ నాజర్, శ్రీనగర్‌కు చెందిన వసీమ్ అహ్మద్ మట్టా, బిజ్‌బేహార్ వాసి అయిన వకీల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు హన్నిబాల్ నటిపోరా ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. వకీల్ అహ్మద్ గతంలో ఇస్లామిక్ స్టేట్ జమ్ము అండ్ కశ్మీర్ ఉగ్రసంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించాడని, రెండేండ్లపాటు జైలుకు కూడా వెళ్లివచ్చాడని చెప్పారు. వారిపై ఆయుధాలు, చట్టవ్యతిరేక కార్యకలాల చట్టం కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ