కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగి 12 మంది గల్లంతు?

కేదార్‌నాథ్ మార్గంలో కొండచరియలు విరిగి 12 మంది గల్లంతు?

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 12 మంది దుకాణం దారులు చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి.  రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.

కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఈ మార్గంలో రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు.  రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ కొండచరియ క్రింద సుమారు 10 నుంచి 12 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామన్నారు. వీరిలో కొందరు కొట్టుకుపోయి ఉండవచ్చునని కూడా తెలిపారు. 

గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఈ కొండచరియ విరిగిపడిందని తెలిపారు. మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. తప్పిపోయినవారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయని జిల్లా ఎస్‌పీ డాక్టర్ విశాఖ తెలిపారు. 

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ దలీప్ సింగ్ రాజ్వర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, రాళ్లు విరిగిపడటం వల్ల మూడు దుకాణాలు ధ్వంసమైనట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే గాలింపు చర్యలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దుకాణాల వద్ద దాదాపు 12 మంది ఉన్నట్లు సమాచారం వచ్చిందని, వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.