దేశంలో 20 నకిలీ యూనివర్సిటీలు

దేశంలో 20 నకిలీ యూనివర్సిటీలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం దేశంలోని 20 విశ్వవిద్యాలయాలను “నకిలీ”గా గుర్తించి ప్రకటించింది. ఈ సంస్థలకు విద్యార్థులకు ఎలాంటి డిగ్రీలు మంజూరు చేయడానికి అధికారం లేదని వెల్లడించింది. 20 నకిలీ విశ్వవిద్యాలయాలలో అత్యధిక సంఖ్యలో (ఎనిమిది) దిల్లీలోనే ఉన్నాయి. 
గుర్తింపు లేని, మోసపూరిత సంస్థల ఉచ్చులో పడకుండా విద్యార్థులను రక్షించడమే తమ లక్ష్యమని యూజీసీ పేర్కొది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీల్లో నమోదు చేసుకునే ముందు ఆ విశ్వవిద్యాలయాల అక్రిడిటేషన్ స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు.

“యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా అనేక సంస్థలు డిగ్రీలు అందిస్తున్నట్లు  యూజీసీ దృష్టికి వచ్చింది. అటువంటి విశ్వవిద్యాలయాలు అందించే డిగ్రీలు ఉన్నత విద్య లేదా ఉద్యోగ ప్రయోజనాల కోసం చెల్లుబాటు కావు. ఇవి విశ్వవిద్యాలయాలు కాదు. వీటికి డిగ్రీని ప్రదానం చేసే అధికారం లేదు’’ అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ఒక ప్రకటనలో తెలిపారు.

ఏపీలోని గుంటూరు కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలను నకిలీవిగా యూజీసీ గుర్తించింది. పశ్చిమబెంగాల్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్ సంస్థలను యూజీసీ నకిలీ వర్సిటీలుగా గుర్తించింది. 

అలాగే కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలో సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్‌ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీలు ఫేక్ అని యూజీసీ ప్రకటించింది. 

దిల్లీలో 8 ఫేక్‌ యూనివర్సిటీల జాబితాలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్ అండ్‌ ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌, కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌- దర్యాగంజ్‌, యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వొకేషనల్‌ యూనివర్సిటీ, ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌, ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ ఉన్నాయని యూజీసీ పేర్కొంది. 

యూపీలో గాంధీ హిందీ విద్యాపీఠ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ (ఓపెన్) యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్‌ నకిలీ ఉన్నట్టు తెలిపింది. గతేడాది 21 యూనివర్సిటీల జాబితాను ‘నకిలీ’గా యూజీసీ గుర్తించింది. ఈ ఏడాది కూడా మరో 20 యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరాయి. యూజీసీ ప్రకారం, విశ్వవిద్యాలయాలు సెంట్రల్, స్టేట్/ప్రావిన్షియల్ చట్టం ప్రకారం స్థాపించబడినట్లయితే లేదా వాటిని డీమ్డ్-టు-బి-యూనివర్శిటీలుగా గుర్తించినట్లయితే మాత్రమే డిగ్రీలు మంజూరు చేయడానికి అధికారం కలిగి ఉంటాయి.