రూ. వందల కోట్ల విలువైన కాందిశీకులు భూమిని రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకొనే ప్రయత్నాన్ని అడ్డుకున్న ఓ మహిళా కలెక్టర్ పై కేసీఆర్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సర్కారు అర్ధాంతరంగా బదిలీ చేస్తూ, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించడం వెనుక ఆమె సుమారు రూ 600 కోట్ల విలువైన వందల ఎకరాల భూములను కాపాడే ప్రయత్నమే అని తెలుస్తున్నది. 
చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ పరిధిలోని 401 ఎకరాల కాందిశీకుల భూములను కాజేయడానికి పన్నాగం పన్నిన ఓ మంత్రి, ప్రజా ప్రతినిధి కలిసి పెట్టుబడి ఆమెను బదిలీ చేయించినట్లు చెబుతున్నారు. పైగా, కాందిశీకుల భూముల వ్యవహారంలో తమ మాట నెగ్గించుకునేందుకు అనుకూలంగా అనుకూలంగా ఉండే అధికారిని వేయించుకోవడం కోసమై ఇప్పటికే చౌటుప్పల్ ఆర్డీవోను బదిలీ చేశారు.
మరోవైపు యాదాద్రి కలెక్టర్‌గా 2013 బ్యాచ్ ఐఏఎస్ టి.వినయ్‌కృష్ణారెడ్డిని ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గట్టెక్కడానికి అధికార పక్షంకు సహకరించిన బృందంతో కాందిశీకుల భూమిని మాయం చేయాలని మంత్రి, మరో ప్రజాప్రతినిధి ఎత్తుగడ వేశారని తెలుస్తోంది.
మునుగోడులో అధికార బీఆర్‌ఎ్‌సకు కొమ్ముకాసి ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన డిప్యూటీ కలెక్టర్‌కు ఆర్డీవోగా నియమించుకోవడం ద్వారా ఆ భూములను స్వాహాచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  దేశ విభజన సమయంలో ఈ భూముల యజమాని మీర్జా మక్సూద్ అలీఖాన్పాకిస్థాన్ వెళ్లిపోయారు.  ఈయనకు చెందిన 1,407.18 ఎకరాలలో 401.36 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం పాక్ నుంచి వచ్చి మహారాష్ట్రలోని కల్యాణ్‌లో ఉంటున్న రాధాబాయి, కొల్హాపూర్‌కు చెందిన తహిల్మిల్ కుటుంబాలకు ఇచ్చింది. వీళ్లిద్దరూ ఎప్పుడూ ఈ భూముల వద్దకు రాలేదు. శిస్తు చెల్లించలేదు. స్వాధీనం చేసుకోలేదు. 
వీరిద్దరూ చనిపోయాక వారసులమంటూ తెరమీదకు వచ్చిన కొందరు దండు మల్కాపూర్ భూమిపై హక్కులున్నాయంటూ వచ్చారు. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ఫౌతీ అమలు చేయాలంటూ చౌటుప్పల్ తహసీల్దారును ఆశ్రయించారు.  ఇందులో నిజానిజాలు నిర్ధారించడానికి 2019 ఫిబ్రవరిలోనే కళ్యాణ్, కొల్హాపూర్ కలెక్టర్లకు యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి లేఖ రాసినా సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఈ భూములపై మంత్రి, ఎమ్మెల్యే కన్ను పడిందనే ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా  ప్రభుత్వ భూములను, వివాదాల్లో ఉన్న భూములను పెద్ద సంఖ్యలో అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై కొందరు మంత్రులతో సహా పలువురు నేతలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పలు చోట్ల ఆందోళనలు కూడా చేపట్టాయి. అయితే రాష్త్ర ప్రభుత్వం మాత్రం అటువంటి ఆరోపణల పట్ల మౌనం వహిస్తూ, పరోక్షంగా భూఆక్రమణలకు సహకరిస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. 
                            
                        
	                    
More Stories
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన