
ప్రెడేటర్ అభివృద్ధి కోసం యూరప్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ రెండు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థల సమాచార గోప్యతకు, భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా అభిప్రాయపడింది. తాజా నిషేధం ప్రకారం గ్రీస్‌లోని ఇంటెలెక్సా, హంగరీలోని సైట్రాక్స్ కంపెనీలతో పాటు ఐర్లాండ్, ఉత్తర మసెడోనియా దేశాలలోని వాటి అనుబంధ సంస్థలు అమెరికా నుండి వస్తువులు, సేవల ఎగుమతి లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే దానిని తిరస్కరిస్తారు.
ఇంటెలిజెన్స్ సంస్థలకు, చట్టాలను అమలు చేసే సంస్థలకు వాణిజ్య స్పైవేర్‌ను విక్రయిస్తున్న కంపెనీలపై బైడెన్ ప్రభుత్వం వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలలో భాగంగానే తాజా నిర్ణయం వెలువడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఎన్‌ఎస్‌ఓకు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను అమెరికా ప్రభుత్వం గతంలోనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ప్రెడేటర్ స్పైవేర్‌ను ఇజ్రాయిల్ సైన్యానికి చెందిన మాజీ సైనికాధికారులు అభివృద్ధి చేశారు.
పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విమర్శకులు, హక్కుల కార్యకర్తలు వంటి ప్రముఖులను పెగాసస్ లక్ష్యంగా చేసుకుందని 2021లో వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని యావత్తూ ఆ స్పైవేర్‌లో పెగాసస్ నిక్షిప్తం చేసింది. దానిని కొన్ని ప్రభుత్వాలకు విక్రయించింది. అయితే ఏయే దేశాలకు అమ్మిందీ ఎన్‌ఎస్‌ఓ గ్రూపు బయటపెట్టలేదు.
పెగాసస్ గూఢచర్యంపై పలు కథనాలు రావడంతో అమెరికా ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఓ పైన, మరో ఇజ్రాయిల్ సంస్థ కాన్‌డిరూ పైన 2021 నవంబర్‌లో నిషేధం విధించింది. ఎన్‌ఎస్‌ఓ మాదిరిగానే ఇప్పుడు రెండు యూరోపియన్ సంస్థలు వ్యవస్థలో చొరబడి ప్రపంచ దేశాలలోని వ్యక్తులు, సంస్థలకు చెందిన సమాచారాన్ని చోరీ చేసి, వాటి భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది.
పెగాసస్‌ను అభివృద్ధి చేసినట్లుగానే ప్రెడేటర్‌ను కూడా ఇజ్రాయిల్ మాజీ సైనికాధికారులే అభివృద్ధి చేశారు. దీనిని సైట్రాక్స్ అభివృద్ధి చేయగా గ్రీస్ సంస్థ ఇంటెలెక్సా విక్రయించింది. ఈ రెండు సంస్థలకూ ఇజ్రాయిల్ దేశానికి చెందిన వేర్వేరు వ్యక్తులు యజమానులు. వీరిలో ఇజ్రాయిల్ సైనిక ఇంటెలిజెన్స్ సెలక్ట్ టెక్నాలజీ యూనిట్ కమాండర్ తాల్ దిలియన్ ఒకరు.
ఎన్‌ఎస్‌ఓ, కాన్‌డిరూ సంస్థలను నిషిద్ధ జాబితాలో పెట్టడంతో సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్న పలు ఇతర సంస్థలు ఇజ్రాయిల్‌లో దుకాణాలు సర్దుకొని, వేరే ప్రాంతాలకు తరలిపోయి కార్యకలాపాలు ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం నిషేధ జాబితాలో చేర్చిన రెండు కంపెనీలు మూట ముల్లె సర్దుకొని విదేశాలకు పోయినా అవి తమ గూఢచర్యాన్ని సజావుగా సాగించలేవని, అవి ఎక్కడ ఉన్నప్పటికీ అమెరికా వదిలిపెట్టదని అధికార వర్గాలు హెచ్చరించాయి.
టొరంటో యూనివర్సిటీకి చెందిన సిటిజన్ ల్యాబ్ 2021 డిసెంబర్‌లో తొలిసారిగా ప్రెడేటర్ స్పైవేర్‌ను వెలుగులోకి తెచ్చింది. అప్పటి వరకూ దాని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈజిప్ట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల పరికరాలలో ఈ స్పైవేర్ గూఢచర్య ఉపకరణాన్ని అమర్చిందని ల్యాబ్ గుర్తించింది. గ్రీకు ఇంటెలిజెన్స్ విభాగం పురమాయించినందుకే ప్రెడేటర్ స్పైవేర్ తన ఫోన్‌లోని సమాచారాన్ని తస్కరించిందని ఓ పాత్రికేయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపారు. పాత్రికేయుడు చెప్పింది నిజమేనని గ్రీకు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పార్లమెంటరీ కమిటీ ఎదుట అంగీకరించారు కూడా.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు