భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక బంధంపై 25 ఏళ్ళ రోడ్‌మ్యా్‌ప్

భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక బంధంపై 25 ఏళ్ళ రోడ్‌మ్యా్‌ప్

భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక సంబంధాలను వచ్చే 25 ఏళ్లలో మరింత బలోపేతం చేయటం కోసం ఒక రోడ్‌మ్యా్‌ప్ ను రూపొందిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇరుదేశాల బంధానికి రక్షణ రంగంలో సహకారం బలమైన పునాదిగా ఉంటుందని వెల్లడించారు. భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో ఫ్రాన్స్‌ సహజ భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. 

ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా రెండోరోజైన శుక్రవారం మోదీ, ఆ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌తో ఎలిసి ప్యాలె్‌సలో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అనంతరం పత్రికా ప్రకటనలను విడుదల చేశారు. 

‘భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ 25 ఏళ్ల పునాదిపై ఆధారపడి వచ్చే 25 ఏళ్ల కోసం రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తున్నాం. దీనికోసం సమున్నత లక్ష్యాలను నిర్దేశించనున్నాం’ అని మోదీ పేర్కొన్నారు.  ‘మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌లలో ఫ్రాన్స్‌ ఒక ముఖ్యమైన భాగస్వామి. ఉగ్రవాదంపై పోరులోనూ కలిసికట్టుగా ఉన్నాం’ అని తెలిపారు. 

ఫ్రాన్స్‌లోని తీరప్రాంత పట్టణం మెర్సిలీ్‌సలో భారత్‌ నూతన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. పునరుత్పాధక ఇంధనం, కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, డిజిటల్‌ టెక్నాలజీ తదితర రంగాల్లో కలిసి పని చేస్తామని మోదీ, మెక్రాన్‌ ప్రకటించారు. 

శుక్రవారం పారి్‌సలో జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవాల్లో (బాస్టిల్‌ డే ఉత్సవాలలో) మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేస్తూ భారత్‌కు దృఢమైన, నమ్మకమైన మిత్రదేశంగా ఉన్నందుకు 140 కోట్ల మంది భారతీయులు ఫ్రాన్స్‌కు కృతజ్ఞతగా ఉంటారని తెలిపారు. ఇరుదేశాల బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. శతాబ్దాల నాటి తన విలువల స్ఫూర్తిగా భారత్‌.. యావత్‌ ప్రపంచం ప్రశాంతంగా ఉండటానికి సర్వశక్తులూ ఒడ్డుతుందని తెలిపారు.

మరోవైపు, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మెక్రాన్‌ కూడా భారత్‌ను కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ‘ప్రపంచ చరిత్రలో ఒక దిగ్గజం, భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన దేశం, వ్యూహాత్మక భాగస్వామి, మిత్రదేశం’గా భారత్‌ను అభివర్ణించారు. 

బాస్టిల్‌ డే ఉత్సవాల సందర్భంగా జరిగిన కవాతులో భారత త్రివిధ దళాల బృందం పాలుపంచుకుంది. గగనతలంలో ఫ్రాన్స్‌ యుద్ధవిమానాలు జరిపిన విన్యాసాల్లో భారత వాయుసేనకు చెందిన రాఫెల్‌ జెట్‌లు కూడా పాల్గొన్నాయి. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య ఉన్న సహకారానికి ఇది నిదర్శమని మోదీ వ్యాఖ్యానించారు. 

ఉత్సవాలను తిలకించటానికి ఫ్రాన్స్‌లో స్థిరపడిన భారతీయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. భారత దళాల పరేడ్‌ సందర్భంగా వారు పెద్ద పెట్టున హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర, సైనిక పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ను ఎమాన్యుయల్‌ మెక్రాన్‌ అందజేశారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు.

మోదీ గౌరవార్థం మెక్రాన్‌ గురువారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీకి కొన్ని బహుమతులు అందజేశారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్‌ సైన్యంతో కలిసి పోరాడిన భారతీయ సైనికుల జ్ఞాపకాలకు సంబంధించిన ఒక అరుదైన ఫోటో వీటిలో ఉంది. 

1916లో ఫ్రాన్స్‌లో జరిగిన సైనిక కవాతులో ఒక భారతీయ సిక్కు సైనికుడికి దారినపోయే వ్యక్తి ఒకరు పువ్వులు ఇస్తున్న దృశ్యం ఈ ఫొటోలో నిక్షిప్తమై ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ‘చార్లెమాగ్నె చెస్‌మెన్‌’ను (చదరంగం పావులను) పోలిన కళాకృతులను, ఫ్రెంచి సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన రచనలను కూడా మెక్రాన్‌ మోదీకి బహుకరించారు.