ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌ హ‌స‌రంగ

శ్రీలంక మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌నిందు హ‌స‌రంగ మ‌రో ఘ‌న‌త సాధించాడు. జూన్ నెల‌కు గానూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక‌య్యాడు. జింబాబ్వే కెప్టెన్ సియాన్ విలియ‌మ్స్, ఆస్ట్రేలియా విధ్వంస‌క క్రికెట‌ర్ ట్రావిస్ హెడ్‌ను వెన‌క్కి నెట్టి అత‌ను ఈ అవార్డు ద‌క్కించుకున్నాడు. 
 
దాంతో, ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డు అందుకున్న రెండో లంక క్రికెట‌ర్‌గా గుర్తింపు సాధించాడు. నిరుడు జూలైలో ప్ర‌భాత్ జ‌య‌సూర్య ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు.  జింబాబ్వే వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో సంచ‌ల‌న బౌలింగ్ చేసిన హ‌స‌రంగకే ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. ఈ టోర్మెంట్‌లో లంక స్పిన్న‌ర్ 10 స‌గ‌టుతో ఏకంగా 26 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతేకాదు వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ఐదు వికెట్ల‌తో మ‌రో రికార్డు నెల‌కొల్పాడు.
 
మ‌హిళ‌ల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ అష్ గార్డ్‌న‌ర్( ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఏకైక యాషెస్‌ టెస్టులో గార్డ్‌న‌ర్ సంచ‌ల‌న బౌలింగ్‌తో ఆసీస్‌ను గెలిపించింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఆమె కేవ‌లం 66 ప‌రుగులే ఇచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టింది. దాంతో, ప‌ర్యాట‌క ఆసీస్ 89 పరుగుల తేడాతో భారీ విజ‌యం సాధించింది. టెస్టు కెరీర్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన ఈ ఆఫ్ స్పిన్న‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.