గత రెండు నెలలుగా జరుగుతున్న మణిపూర్ హింసాకాండలో మొత్తం 142 మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మణిపూర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని, అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని తెలిపింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుంది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని పిటిషనర్లను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వెస్ వాదనలు వినిపిస్తూ, మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, గట్టి సూచన చేయాలని కోరారు. గొంజాల్వెస్‌ను ఉద్దేశించి చంద్రచూడ్ మాట్లాడుతూ, ‘‘శాంతిభద్రతలను మేం స్వాధీనం చేసుకునేలా మీ సంశయవాదం చేయజాలదు’’ స్పష్టం చేశారు.
దీనిపై గొంజాల్వెస్ స్పందిస్తూ, మణిపూర్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని చెప్పారు. అందుకు చంద్రచూడ్ బదులిస్తూ, ‘‘రాష్ట్రంలో ఉన్న హింస, ఇతర సమస్యలను మరింత పెంచడం కోసం వేదికగా ఈ ప్రొసీడింగ్‌ను వాడుకోకూడదు. భద్రతా యంత్రాంగాన్ని లేదా శాంతిభద్రతలను మేం నడపలేం. సలహాలేమైనా ఇస్తే స్వీకరిస్తాం’’ తెలిపారు.
ఇది మానవతావాదానికి సంబంధించిన సమస్య అని, దీనిని పార్టీలకు సంబంధించిన అంశంగా చూడవద్దని హితవు చెప్పారు. ‘‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నాం, అయితే ఈ న్యాయస్థానంలో వాదించడానికి కొన్ని పద్ధతులు ఉండాలి’’ అని స్పష్టం చేశారు. ధర్మాసనం ముందు ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి సమర్పించిన తాజా నివేదికలో పరిస్థితిని అదుపులోకి తీసుకు రాడానికి 5995 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 6745 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం ఆరు కేసులను సిబిఐకి బదిలీ చేసినట్టు తెలిపారు.
మే నుంచి దాదాపు ఐదు వేల ఘటనలు జరిగాయని, ఎక్కువగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అధిక మరణాలు సంభవించినట్టు నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతాల్లోనే 5 వేలకు పైగా ఘర్షణలు చోటు చేసుకున్నాని పేర్కొంది. మరణాలు కూడా ఈ జిల్లాల్లోనే అధికంగా చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలను కాపాడినట్లు తెలిపింది.
124 పారామిలటరీ బలగాలు, 184 ఆర్మీ బలగాలను రంగంలోకి దించినట్లు చెప్పింది. పునరావాస శిబిరాల్లో ఉన్న విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి కర్ఫూను పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హింసాకాండను అరికట్టేందుకు బాధితులకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తాజా నివేదికను సమర్పించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Stories
‘మెుంథా’ తుపానుతో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు
కౌలు రైతుల సమస్యలు పట్టని కూటమి ప్రభుత్వం
విద్యార్థులే లేని 7,993 పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు