ఏపీలో ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం

ఏపీలో ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినం
సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, ఇకపై ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. విజయవాడలో  సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు అనే అంశంపై ఏపీ ఉమెన్స్ కమిషన్ ఆధ్వర్యలో బుధవారం సెమినార్ నిర్వహించారు. 
 
సెమినార్ కు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో రాతి యుగం కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో వారిని మరి కొందరు ప్రోత్సహించటం  దారుణమని ఆమె మండిపడ్డారు.
 
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని, ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కేసు తీర్పును ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారని చెబుతూ ఇది మంచి పద్దతి కాదని ఆమె హెచ్చరించారు. 
 
నేటి కాలంలో సోషల్ మీడియాలో కొందరు ముసుగు వేసుకుని ఇష్టారీతిన మహిళలపై సైతం అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టడం ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. మహిళలపై సోషల్ మీడియాలో పెస్టులు పెట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా దిశ, సైబర్ మిత్ర తదితర యాప్ లద్వారా పోలీస్ వారి సహాయం పొందాలని పద్మా సూచించారు.
 
ఇలాంటి సంఘటనలపై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే సత్ఫలితాలు ఉంటాయని ఆమె చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి అన్ని అవకాశాలు కల్పిస్తుంటే కొందరు దుర్భుద్దితో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
 
సెమినార్ మఖ్య ఉద్దేశ్యం ఎవరైనా సరే ఈ రోజు నుంచి మహిళలపై అసభ్యంగా పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే ఆ ఇంట్లో లోని మహిళలను బయటకు లాగి ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు అంటగట్టి వారి ఆక్రోశంను వెళ్లగక్కుతున్నారని ఇది మంచి పద్దతి కాదని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, చైల్డ్ రైట్స్ ఛైర్ పర్సన్ అప్పారావు, రేషిమున్నీషా బేగం, విజయవాడ డిసీపీ అజిత, విజయవాడ డిప్యూటీ మేయర్లు శ్రీశైలజా రెడ్డి, బెల్లం దుర్గా, రిటైర్డ్ ఐఏఎస్ ఉషా కుమారి, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ రిజిస్ట్రార్ కరుణ, సెర్ప్ డైరక్టర్ విజయ కుమారి, ఐద్వా రమాదేవి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.