‘బలగం’కు 100 అంతర్జాతీయ అవార్డులు

‘బలగం’కు 100 అంతర్జాతీయ అవార్డులు
ఎటువంటి అంచనాలు లేకుండా తెలంగాణ సంప్రదాయాల భూమికతో  విడుదలై సంచలనం సృష్టించిన `బలగం’ సినిమాకు 100 అంతర్జాతీయ అవార్డులు లభించాయి.  ‘‘ఇదొక అద్భుత‌మైన మ‌రుపురాని ప్ర‌యాణం. ఇది వ‌ర‌కు మ‌న సినిమాలు 100 రోజులు.. 100 సెంట‌ర్స్‌. రూ. 100 కోట్లు క‌లెక్ట్ చేయ‌టం వంటి రికార్డుల‌ను సాధించాయి. ఇప్పుడు 100 అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సాదించ‌టంతో బ‌ల‌గం సినిమా ప్ర‌త్యేకమైన చిత్రంగా నిలిచింది’’ అంటూ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేక్ష‌కుల హృద‌యాల‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకున్న ‘బలగం’ సినిమా థియేట‌ర్స్‌లలో వసూళ్ల ప‌రంగా సంచలనం కలిగించడమే చేయ‌ట‌మే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్స్ సృష్టించింది.
బలగం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలంగాణలోని దాదాపు అన్ని ఊళ్లలో ప్రదర్శించారు. ఈ చిత్రం దూరమవుతున్న సంబంధబాంధవ్యాలను దగ్గర చేసింది.  ఈ సినిమా చివరిలో మొగిలయ్య, కొమురమ్మలు పాడే పాట అందరిని కంటతడి పెట్టిస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు కలిసి ఉండాలని ఆ పాటలో వారు చెబుతారు. బలగం సినిమాను సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ బలగం సినిమా చూసి ఎన్నో కుటుంబాలు కలిసిపోయాయి. ఎంత మంది తమ కోపాలను పక్కకు ఒక్కటయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. తాజాగా ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒక‌టి రెండు కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శింపబ‌డి 100కి పైగా అంత‌ర్జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది.
ఇక్క‌డి సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను హృద్యంగా తెర‌కెక్కించిన తీరు అంత‌ర్జాతీయంగా ప్రేక్ష‌కుల మెప్పును పొందేలా చేసింది.  ఇందులో న‌టీన‌టులు అద్భుతంగా న‌టించారు. దానికి తోడు చ‌క్క‌టి సాంకేతిక‌త తోడు కావ‌టంతో సినిమా అంద‌రి హృద‌యాల‌ను క‌దిలించింది. 
అంత‌ర్జాతీయంగా ఎన్నో విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకుందీ చిత్రం.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ   చిత్రంలో ఇంకా వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ర్షిత్, హ‌న్షిత  బ‌ల‌గం సినిమాను ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో త‌న అద్భుత‌మైన సంగీతంతో  ఈ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామాకు ప్రాణం పోశారు.