తెలుగు రాష్ట్రాల బిజెపికి పురందేశ్వరి, కిషన్ రెడ్డిల సారధ్యం

తెలుగు రాష్ట్రాల బిజెపికి పురందేశ్వరి, కిషన్ రెడ్డిల సారధ్యం
రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నియమించారు. ప్రస్తుత అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్ ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.
 
ఏపీ అధ్యక్షులుగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షులుగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని నియమించారు.  పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీ నియమించింది.
 
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టడం కోసం భారతీయ జనతా పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. పంజాబ్‌ బీజేపీ అధ్యక్షునిగా సునీల్ జఖర్, జార్ఖండ్‌ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరండీలను నియమించారు.
తొలుత, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన తర్వాత సంజయ్ తన రాజీనామాను సమర్పించారు.