
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా మరోసారి అక్కడ హింస చెలరేగింది. కాంగ్‌పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో గురువారం జరిగిన అల్లర్లను ఆపేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, అతని మృతదేహాన్ని ఇంఫాల్ కు తీసుకొచ్చారు.
ఇది తెలుసుకున్న ప్రజలు అతనికి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున గుమిగూడారు. మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబండ్ బజార్ కు తీసుకు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కర్ఫ్యూ నిషేధాజ్ఞలను పక్కనపెట్టి వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.
మృతదేహాన్ని ముఖ్యమంత్రి నివాసం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్తామని హెచ్చరించారు. పోలీసుల అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు రోడ్ల మధ్యలో టైర్లు కాల్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టడానికి బాష్పవాయువును ప్రయోగించారు.
అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిశవాగారానికి తరలించారు. మరో ఘటనలో ఇదే జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
హరావ్థెల్ గ్రామంలో ఆందోళనకారులు తొలుత రెచ్చగొట్టేలా కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. కాగా, సుమారు రెండు నెలలుగా జరుగుతున్న ఈ అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
రాహుల్ పర్యటన ఉద్రిక్తం
ఇలా ఉండగా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన రెండు రోజుల మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్‌లో కాన్వాయ్‌ను పోలీసులు గంటల పాటు నిలిపేశారు. ఈ ప్రాంతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో అక్కడికి నేతలను పంపించడం బాధ్యతారాహిత్యం అవుతుందని అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా, మణిపూర్ లో శాంతి పునరుద్దరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న సమయంలో ఉద్రిక్తత నెలకొన్న ప్రదేశాలలో రాజకీయ నాయకులు ప్రయోజనం పొందే ప్రయత్నం చేయరాదని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ హితవు చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అక్కడ శాంతిని నెలకొల్పే అవకాశం ఉన్న దృష్ట్యా ఇతర నాయకులు మరెవ్వరు అక్కడకు వెళ్లి చేసెడిది ఏమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా